బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ల ద్వంద్వ వైఖరి.. తెలంగాణ బంద్‌కు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు

by Ramesh Naini |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన G.O.9 కు తెలంగాణ జన సమితి పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు.

బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ల ద్వంద్వ వైఖరి.. తెలంగాణ బంద్‌కు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Local body elections) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన G.O.9 కు తెలంగాణ జన సమితి పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) ప్రకటించారు. మంగళవారం బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావి నారగోని తదితరులు నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో కోదండరాంతో భేటీ అయ్యారు. (Telangana bandh) రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు టీజేఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ బంద్‌లో పాల్గొంటుందని కోదండరాం వెల్లడించారు.

బీసీ సంఘాలు చేసే అన్ని పోరాటాలకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ బీసీలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నాయని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించిన బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్న కోదండరాం బీసీల ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. గల్లి నుండి ఢిల్లీ స్థాయి వరకు జరిగే పోరాటంలో తమతో కలిసి రావాలని ఆయన కోరారు. జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని రాష్ట్రపతిలను కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నాయకులు గోపగాని శంకర్రావు, పల్లె వినయ్ కుమార్, రమేశ్ ముదిరాజ్, ఆర్ లక్ష్మి, జస్వంత్ కుమార్, బైరి రమేశ్, బాబు, సయ్యద్ ఇస్మాయిల్, దార సత్యం, రామచందర్, ఖాదర్ పాషా, హనుమంత్ గౌడ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story