యాదగిరిగుట్టలో గెస్ట్ హౌస్‍లకు తిరుమల మోడల్.. సమీక్షలో సీఎం ఆదేశాలు

by Prasad Jukanti |

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూముల కేటాయింపు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

యాదగిరిగుట్టలో గెస్ట్ హౌస్‍లకు  తిరుమల మోడల్.. సమీక్షలో సీఎం ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి కోసం భూముల కేటాయింపుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుసరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఏ ప్రాతిపదికన స్థలాలు ఇచ్చినా సదరు భూమి యాజమాన్యపు హక్కులు మాత్రం పూర్తిగా టెంపుల్ బోర్డు వద్దే ఉండాలని అధికారులకు తేల్చిచెప్పారు. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్‍హెచ్‍ఆర్‍డి బోధి పెవిలియన్‍లో ఇవాళ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరి గుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలని ఆదేశించారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపు పైన ఒక విధానం రూపొందించాలన్నారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపు పైన స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారుచేయాలన్నారు.

వారంలో నివేదిక ఇవ్వండి:

గుట్టపైన గెస్ట్ హౌస్‍ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలని విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. గెస్ట్ హౌస్ ల నిర్మాణం పైన తిరుమల మోడల్ ను అనుసరించాలని భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలన్నారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణంపైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక పైన అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Next Story