నిమ్స్‌ తరహాలో టిమ్స్‌లకు స్వయం ప్రతిపత్తి.. అధికారులకు మంత్రి దామోదర దిశానిర్దేశం

by Ajay Maddhiboyina |

టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్‌, ఎయిమ్స్ హాస్పిటళ్ల తరహాలో పరిశుభ్రత, పేషెంట్‌కేర్‌‌కు సమప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.

నిమ్స్‌ తరహాలో టిమ్స్‌లకు స్వయం ప్రతిపత్తి.. అధికారులకు మంత్రి దామోదర దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్‌, ఎయిమ్స్ హాస్పిటళ్ల తరహాలో పరిశుభ్రత, పేషెంట్‌కేర్‌‌కు సమప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. నిమ్స్ తరహాలో టిమ్స్‌లలోనూ స్వయం పాలన వ్యవస్థ ఉండాలన్నారు. త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్, ఎయిమ్స్‌లో అవలంభిస్తున్న విధానాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేసి, నివేదిక తయారు చేశారు.

ఈ నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు పనిచేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య, పెడుతున్న ఖర్చు, తదితర అంశాలను మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా, నిమ్స్‌ కంటే మెరుగైన హాస్పిటళ్లను ప్రజలకు అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన అని మంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల వసతులతో హాస్పిటళ్లు ఉండాలని, అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకాడమిక్స్‌ విభాగాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు.

నిమ్స్‌ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్‌తో పాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా ఉండాలని మంత్రి అన్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై స్పష్టమైన జాబ్‌చార్ట్‌ ఉండాలని మంత్రి ఆదేశించారు. గతంలో ధనవంతులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చికిత్స కోసం గాంధీ, ఉస్మానియాకు వెళ్లేవారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు టిమ్స్‌లను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌ కుమార్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, ప్రొఫెసర్ విమలా థామస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story