- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు ప్రాజెక్టులకు టైమ్‌బౌండ్.. 2027 నాటికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ముమ్మరం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల పాలమూరు ప్రాజెక్టుల పర్యటనలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సోమవారం మంత్రి ఉత్తమ్ సెక్రెటేరియట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ఖచ్చితమైన గడువుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిలో అడ్డంకిగా ఉన్న భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సరఫరా, కాంట్రాక్టర్ల పనితీరు వంటి అంశాలను మిషన్ మోడ్‌లో పరిష్కరించాలని సూచించారు. పాలమూరులో సాగునీటి రంగానికి కొత్త ఊపిరి పోసే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టులోని ప్రధాన భాగాల పూర్తి షెడ్యూల్‌ను చీఫ్ ఇంజినీర్లు సమర్పించాలని ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పంప్‌హౌస్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పూర్తిచేసి 2027 మార్చి నాటికి అన్ని మోటార్లను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయాలని ఆదేశించారు. నార్లాపూర్ రిజర్వాయర్ కింద కాలువల నిర్మాణాన్ని వేగవంతం చేసి, పంపిణీ వ్యవస్థతో సహా మొత్తం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డికి ప్రాధాన్యం
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమీక్షించారు. నార్లాపూర్, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాస చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరివేన రిజర్వాయర్ వరకు ప్రధాన మౌలిక సదుపాయాల పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌస్‌లకు తక్షణమే విద్యుత్ కనెక్టివిటీ కల్పించాలని సూచించారు. భవిష్యత్ విద్యుత్ వ్యయాలను తగ్గించే లక్ష్యంతో రిజర్వాయర్ల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. మక్తల్-నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన సుమారు 2,200 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను 2026 జూలై నాటికి ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే రిక్విజిషన్‌లో ఉన్న 4,200 ఎకరాల భూమికి సంబంధించిన భూసేకరణ, పునరావాస ప్రక్రియలను పూర్తి చేసి మొదటి దశ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి అవసరమైన మిగిలిన 80 ఎకరాల భూసేకరణను 2026 జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన మిగిలిన 167 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను పూర్తి చేసి, అన్ని పెండింగ్ పనులను 2027 మార్చి నాటికి ముగించాలని సూచించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద అదనంగా 58 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన 534 ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
ఆర్డీఎస్-తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం
గూడెందొడ్డి రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. పంప్‌హౌస్‌ల సమీపంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆర్డీఎస్-తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన 567 ఎకరాల భూమిని రైతులతో సంప్రదింపులు, పరస్పర అంగీకారంతో సేకరించి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రాజెక్టుల పురోగతిని ప్రతినెలా సమీక్షించి భూసేకరణ, నిధుల అవసరాలు, కాంట్రాక్టర్ల పనితీరు, అమలు స్థితిపై నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2027 నాటికి పాలమూరు ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి.. రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.






