TG Assembly: అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత.. పోలీసులతో భారీ బందోబస్తు..

by Ramesh Naini |

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

TG Assembly: అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత.. పోలీసులతో భారీ బందోబస్తు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. వందలాది మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను అమలు చేస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నేడు మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మొత్తం రూ. 531 కోట్ల విలువైన బిల్లులు ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ మాజీ సర్పంచులు ఆందోళనకు సిద్ధమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తుగా పలువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఈ రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానం ఉండగా, శాసన మండలిలో మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్‌లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

శాసనసభ, శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్కలు వివిధ పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. సమావేశాలకు హాజరయ్యేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమయ్యారు.

Next Story