- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు పోటీగా టైర్-2 నగరాలు: వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లకు 'ఔటర్' హంగులు!
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలను సెకండ్ టైర్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు దీటుగా రెండోస్థాయి నగరాలను అభివృద్ధి చేయాలని, అందుకు వీలైనన్ని కేంద్ర ప్రభుత్వం నిధులను రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టింది. ఈ మూడు నగరాలకు ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డును కూడా ప్లాన్ చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతోపాటు కార్పొరేషన్‌కు సమీపంలోని మున్సిపాలిటీలతో క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని టు టైర్, త్రీ టైర్ నగరాలకు మొత్తంలో అర్బన్ చాలెజింగ్ ఫండ్(యూసీఎఫ్) ద్వారా నిధులొచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక కారిడార్లు..
రాష్ట్రంలో 133 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా.. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మినహాయిస్తే సీడీఎంఏ పరిధిలో 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గతంలో సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల కోసం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి 10 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. కానీ ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల ప్రాంతాలను కలిపి కారిడార్, కొత్తగూడం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి మరో కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
రుణాలు తీసుకునే వెసులుబాటు..
కేంద్రం నుంచి అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ద్వారా నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్, కారిడార్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆర్థికంగా మెరుగైన నగరాల్లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకుని ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశముంది. కానీ చిన్న నగరాలకు ఆ పరిస్థితి లేదు. చిన్న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. మొదటిసారిగా రుణం తీసుకుంటున్న నగరాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ కింద ప్రాజెక్టు వ్యయంలో 70శాతం వరకు సపోర్ట్ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ప్రయివేటు/కార్పొరేట్ సంస్థల నుంచి సైతం టైర్-2, టైర్-3 నగరాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
క్లాస్-1 నగరాల్లో డ్రింక్ టు ట్యాప్..
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు లక్షకుపైగా జనాభా కలిగిన నగరాల్లో సైతం తాగునీటి పథకాలను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. దీని కోసం అర్బన్ చాలెంజింగ్ ఫండ్ కోసం మున్సిపల్ శాఖ రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో భాగంగా కేంద్రప్రభుత్వ పథకమైన ‘డ్రింక్ టు ట్యాప్’ స్కీమ్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్నవాటిని మెరుగుపర్చనున్నారు.






