ఆన్‌లైన్‌లో టికెట్లు సోల్డ్ ఔట్.. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు యమ డిమాండ్

by Kema Shiva Kumar |

ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుండడంతో.. ప్రత్యక్షంగా తిలకించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోటీ పడుతున్నారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు సోల్డ్ ఔట్.. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు యమ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుండడంతో.. ప్రత్యక్షంగా తిలకించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోటీ పడుతున్నారు. అందుకోసం ఈవెంట్ నిర్వాహకులు ఇచ్చే పాసుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అలాగే క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికే నేరుగా ఫోన్ చేసి పాసులు పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, మంత్రికి ఎన్ని పాసులు ఇవ్వాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఫ్రీ పాసుల కోసం ఆరాటం

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఆడనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ ను చూసేందుకు ఫుట్ బాల్ అభిమానులు పోటీ పడడం సహజం. కానీ రాజకీయ నాయకులు సైతం పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్లీ మ్యాచ్ లో మెస్సీ ప్రత్యర్థి జట్టులో సీఎం రేవంత్ రెడ్డి ఆడనున్నారు. దీంతో ఆ మ్యాచ్ కు ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే స్టేడియంలోని ఖరీదైన టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. ఆయనతో కలిసి ఫలక్ నుమా ప్యాలెస్ లో ఫొటో దిగేందుకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఫీజు నిర్ధారించారు. ఆ టికెట్లు కూడా వంద మందికి మాత్రమే ఇచ్చారు. అవి కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. అయితే ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వానికి కొన్ని ఫ్రీ పాసులు ఇచ్చారు. వాటిని దక్కించుకోవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈవెంట్ సంస్థతో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ కో–ఆర్డినేషన్ చేస్తున్నారు. దీంతో అందరూ ఆయనకు ఫోన్ చేసి పాసుల కోసం ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఎవరికి ఎన్ని పాసులు ఇవ్వాలో తెలియక ఆయన సైతం చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో కొందరు సీఎంఓ, సీఎస్ ఆఫీసుకు ఫోన్ చేసి పాసులు అడుగుతుండడంతో ‘ఆ పొగ్రామ్ సర్కారు నిర్వహించడంలేదు. ప్రైవేటు పొగ్రాం’ అని వివరిస్తున్నట్లు తెలిసింది.

మంత్రికి ఫోన్ల మీద ఫోన్లు

పాసులను మంత్రులకు పంపిణీ చేసే బాధ్యతలను క్రీడల మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించినట్లు టాక్ ఉంది. విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వాకిటికి ఫోన్ చేసి ‘పాసులు ఎప్పుడు ఇస్తున్నావు అన్న. కొన్ని ఎక్కువ పాసులు పంపు. పిల్లలు కూడా స్టేడియానికి వస్తరు. వాళ్ల ఫ్రెండ్స్ కూడా ఉంటరు’ అని వివరిస్తూ ఎక్కువ పాసులు కావాలని కోరుతున్నారు. దీంతో ఆ ఫోన్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మంత్రి వాకిటి మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఎందుకంటే గురువారం రాత్రి పొద్దుపోయేవరకు పాసులు పంపుతున్నట్లు ఆయనకు ఎవరూ చెప్పలేదని సమాచారం. అయితే మంత్రి వాకిటి తనయుడు పెద్ద పరేషాన్ లో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. తన తండ్రి క్రీడల శాఖ మంత్రి కావడంతో వీవీఐపీ పాసులు వస్తాయనే అంచనాతో విదేశాల్లో ఉన్న తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి హైదరాబాద్ కు రప్పించారట. కానీ ఇంతవరకు పాసులు అందకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Next Story