ఆయిల్ పామ్ రైతులకు భరోసా కలిగించే పంట : మంత్రి తుమ్మల

by velandi.Saikiran |

రైతులు పంట అవశేషాలను కాల్చిలే నేలలోని సేంద్రియ పదార్థం పూర్తిగా నాశనమై భూసారం తగ్గి సహజ పోషకాలు దెబ్బతింటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

minister-thummala
X

minister-thummala

పంట అవశేషాలు కాల్చితే నేలలో సహజ పోషకాలకు దెబ్బ

యుద్దం కారణంగా యూరియా సరఫరాలో అటంకాలు

రైతులను ఆదుకునేందుకు మొక్కజోన్న పంట కొనుగోలు

ఆయిల్ పామ్ రైతులకు భరోసా కలిగించే పంట : మంత్రి తుమ్మల

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు పంట అవశేషాలను కాల్చిలే నేలలోని సేంద్రియ పదార్థం పూర్తిగా నాశనమై భూసారం తగ్గి సహజ పోషకాలు దెబ్బతింటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. కాల్చడం చేస్తే పంటలకు వేసే యూరియా, పురుగుమందులు సరిగా పనిచేయవని, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పంట అవశేషాలను కాల్చే విధానాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్ని పంట వ్యర్థాలను కాల్చడం, యూరియా సరఫరా సమస్యలు, ఎల్‌నినో ప్రభావం అంశాలపై వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా నేల సారం పెరుగుతుందని, సేంద్రియ శక్తి పెరిగి పంటలకు మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. యూరియా, పురుగుమందుల వినియోగం కూడా తగ్గుతుందని, రైతుల వ్యయభారం తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు.

ఇందు కోసం అవసరమైన వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. ఎవరైనా రైతులు పంట అవశేషాలు కాల్చినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని, వాయు కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఉండవచ్చని తెలిపారు. శాటిలైట్ సాంకేతికత ద్వారా పంట అవశేషాలు ఎక్కడ కాల్చుతున్నారో గుర్తించి, సంబంధిత రైతులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ఇతర దేశాల నుండి భారతదేశానికి రావాల్సిన యూరియా సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఖరీఫ్ సీజన్ అవసరాల కోసం గత నవంబర్ నెల నుంచే పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ, కేంద్రం యూరియా సరఫరాలో నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందన్నారు. యూరియా ఉత్పత్తి చేయడం, రాష్ట్రాలకు సరఫరా చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, అయినప్పటికీ రాష్ట్ర బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అన్యాయమన్నారు.

రైతులను ఆదుకునేందుకు మొక్కజోన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుండి పంటలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని నాఫెడ్, ఎఫ్‌సీఐ వంటి సంస్థలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను కొనుగోలు చేయకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే జొన్న, మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు.

ఈ ఏడాది రైతులకు గడ్డుకాల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందన్నారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో యూరియా సరఫరా కూడా ఆలస్యం కావచ్చని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ అధికారులతో సంప్రదించి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తుందని, దానిలో అంతర పంటలుగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చని చెప్పారు. ఎకరానికి నెలకు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశమున్న సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

Next Story