ఎల్-నినో సవాళ్లను మైక్రో ఇరిగేషన్‌తో అధిగమిస్తాం

by velandi.Saikiran |

రాష్ట్రంలో ఎల్-నినో పరిస్థితుల అధిగమించేందుకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు.

ఎల్-నినో సవాళ్లను మైక్రో ఇరిగేషన్‌తో అధిగమిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎల్-నినో పరిస్థితుల అధిగమించేందుకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. శనివారం సచివాలయంలో కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లోనే ప్రభుత్వంతో పాటు కంపెనీల బాధ్యత కూడా మరింత పెరుగుతుందని అన్నారు. రైతులు సంప్రదాయ పంటల నుంచి పంటల వైవిధ్యీకరణ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో వారికి అవసరమైన సూక్ష్మ సాగునీటి సదుపాయాలను అందిస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని సుమారు 30 లక్షల బోర్‌వెల్స్ ద్వారా సాగు జరుగుతోందని పేర్కొన్నారు. డ్రిప్ వ్యవస్థతో తక్కువ నీరు, తక్కువ విద్యుత్, తక్కువ పురుగుమందులతో అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సాగునీటి విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సంవత్సరానికి 2,38,750 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించామని, ఇందులో 85 వేల ఎకరాలు ఆయిల్‌పామ్‌కు, 1,53,750 ఎకరాలు ఇతర పంటలకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 65,446 ఎకరాలకు పరిపాలనా అనుమతులు జారీ చేసినప్పటికీ, కేవలం 34,909 ఎకరాల్లో మాత్రమే డ్రిప్ వ్యవస్థల ఏర్పాటు పూర్తైందని, ఇంకా 30,537 ఎకరాల్లో పనులు పెండింగ్‌లో ఉండటం సంతృప్తికరంగా లేదన్నారు.

ప్రతి మైక్రో ఇరిగేషన్ కంపెనీ తమకు కేటాయించిన జిల్లాల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైతులకు అందించే పరికరాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, ప్రమాణాలకు అనుగుణమైన సామగ్రినే అందించాలని స్పష్టం చేశారు. వ్యవస్థల ఏర్పాటు అనంతరం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను క్రమం తప్పకుండా అందిస్తూ, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కంపెనీలు బెంచ్‌మార్క్ సర్వే , బిల్ ఆఫ్ క్వాంటిటీస్ పూర్తి చేసి, పరిపాలనా అనుమతుల కోసం వెంటనే సమర్పించాలని సూచించారు. పరిపాలనా అనుమతుల జారీ ప్రక్రియలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు జారీ అయిన వెంటనే రైతులకు అవసరమైన డ్రిప్ సామగ్రి సరఫరా చేసి, సంస్థాపన పనులను పూర్తి చేయాలని చెప్పారు.

రైతులకు నీటి పొదుపుపై అవగాహన అవసరం :

ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూపొందించిన కంటింజెన్సీ కార్యాచరణలో భాగంగా గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో అన్ని మైక్రో ఇరిగేషన్ కంపెనీలు తప్పనిసరిగా పాల్గొని రైతులకు నీటి పొదుపు, సూక్ష్మ సాగునీటి ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారులు వ్యవసాయశాఖతో పాటు ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకొని లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కంపెనీల ప్రతినిధులు తమ ఆర్థికపరమైన ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు 400 కోట్లు చెల్లించామని, అయితే, చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పనుల వేగం తగ్గించడం సమంజసం కాదని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులను నిరాటంకంగా కొనసాగించాలన్నారు. కంపెనీల పనితీరును ప్రభుత్వం జిల్లాల వారీగా నిరంతరం సమీక్షిస్తుందని, ఆలస్యం, నాణ్యత లోపాలు లేదా రైతుల ఫిర్యాదుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కంపెనీలకు సూచించారు. అవసరమైతే ఇతర జాతీయ, అంతర్జాతీయ మైక్రో ఇరిగేషన్ కంపెనీలు తెలంగాణలో పనిచేయడానికి ఆసక్తి చూపితే, వాటిని కూడా ఎంప్యానెల్ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రభుత్వం, అధికారులు, మైక్రో ఇరిగేషన్ కంపెనీలు సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని, సూక్ష్మ సాగునీటి విస్తరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Next Story