- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు నెలల రేషన్ ఒకేసారి.. దళారుల కన్ను సన్నబియ్యంపైనే!
ఎండల దృష్ట్యా కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వేసవి ఎండల కారణంతో పేదలకు మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది దళారులకు వరంగా మారిందనే టాక్వినిపిస్తోంది. ఒక లబ్ధిదారుకు ఒకేసారి 18 కిలోల చొప్పున పంపిణీ చేయనుండటంతో పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు బ్రోకర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ సర్కారు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకోసం ఏటా రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొంటోంది. అయితే సన్నబియ్యం సైతం అడ్డదారిలో బయటి మార్కెట్‌లోకి వెళ్తోంది. గత ఆరు నెలలుగా విజిలెన్స్అధికారుల తనిఖీల్లో 1500 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. కేసులు నమోదు చేసినా సులభంగా డబ్బు సంపాదించే మార్గం కావడంతో అక్రమ వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది. డీలర్లను మచ్చిక చేసుకుంటున్న దళారులు గుట్టుగా దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1.02 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్ధిదారులకు 2.02 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. మూడు నెలల రేషన్ఒకేసారి ఇస్తే సుమారు 6 లక్షల మెట్రిక్‌టన్నులు రేషన్‌దుకాణాలకు సరఫరా చేయాలి. అయితే ఇందులో సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నులు బ్లాక్మార్కెట్లోకి వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు నెలల బియ్యం పంపిణీపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. పంపిణీకి నిల్వలు ఏ మేరకు ఉన్నాయనే అంశంతోపాటు ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది.
స్టాక్ భద్రపరచడం సమస్యే..
గడిచిన వానకాలంలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసిప్పుడు రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టాక్ భద్రపరచడానికి సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. బయోమెట్రిక్ విధానంలో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ-పోస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు రెండు వారాల పాటు రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాప్ట్‌వేర్, ఇతర నిబంధనల అప్‌డేట్, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడం, హమాలీలకు పని భారం తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్, పంపిణీ తేదీలను ప్రకటిస్తామని పౌరసరఫరాల శాఖ పేర్కొన్నది.
అలా చేస్తే బ్లాక్ మార్కెట్‌కు చెక్..
నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన ధనవంతుల కార్డులు కట్ చేస్తే బ్లాక్మార్కెట్దందాకు అడ్డుకట్ట వేయవచ్చని డీలర్లు భావిస్తున్నారు. వారంతా ఆరోగ్య శ్రీ, పిల్లలకు ఉపకార వేతనాలకు తప్ప రేషన్‌బియ్యం తీసుకోవడం లేదు. వారికి రావాల్సిన రైస్దళారులకు కిలో రూ. 15 చొప్పన అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో మూడు నెలలు పంపిణీ చేసినప్పడు భారీగా పీడీఎస్అమ్మకాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో భాగా లాభాలు పొందిన బ్రోకర్లు ఈసారి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఏకంగా ఇతర దేశాలకు తరలించేలా ప్లాన్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కోటిపైగా రేషన్‌కార్డులు ఉంటే ఆదాయ పన్ను, నాలుగు చక్రాల వాహనాలు, భవంతులు కలిగినవారు 8 నుంచి 9 లక్షల వరకు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. వివరాలు ప్రభుత్వానికి పంపగా తొలగింపు విషయంలో స్పష్టత రాలేదు.






