మహానగరంలో మూడు కార్పొరేషన్లు.. మూసీ ఆధారంగా విభజన?

by Naga Rani Yarlagadda |

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

మహానగరంలో మూడు కార్పొరేషన్లు.. మూసీ ఆధారంగా విభజన?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో పాటు 300 వార్డులుగా పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. మెగా మహానగరంగా మారిన హైదరాబాద్ పర్యవేక్షణ, పరిపాలన కష్టమని భావిస్తున్న సర్కార్.. దాన్ని 3 ముక్కలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మూడు నగరాలతో పాటు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2026 ఫిబ్రవరి10న జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. అప్పటివరకు 300 వార్డులతో కూడిన జీహెచ్ఎంసీగానే ఉంటుందని, ఆ తర్వాత 100 వార్డులతో కూడిన 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

మూడు కార్పొరేషన్లు..

జీహెచ్ఎంసీలోని 150 వార్డులతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలను కలిపి 300 వార్డులుగా పునర్విభజించారు. వీటిని 100 వార్డులతో కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిన్నట్టు అధికారులు చెబుతున్నారు. 100 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మరో 100 వార్డులతో గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎస్ఎంసీ), ఇంకో 100 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ)గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. మూసీ ఆధారంగా కార్పొరేషన్లను విభజించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఒక్కో కార్పొరేషన్‌లో..

ఒక్కో కార్పొరేషన్‌లో 100 వార్డులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని 5 వార్డులతో ఒక సర్కిల్ అంటే 20 సర్కిళ్లను ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు సర్కిళ్లతో ఒక జోన్ చొప్పున 5 జోన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ కార్పొరేషన్‌కు కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించనున్నారు. 300 వార్డులతో పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో అధికారం కేంద్రీకృతమవుతోందని, కానీ అధికార వికేంద్రీకరణకే ప్రభుత్వం మొగ్గు చూపిందని పలువురు అధికారులు చెబుతున్నారు.

డెవలప్‌మెంట్ రైట్స్ హెచ్ఎండీఏకు ఉండేలా..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు మధ్య డెవలప్‌మెంట్ రైట్స్ కొంత సందిగ్దత నెలకొన్నది. మూడు కార్పొరేషన్లకు ఉండాల్సిన అధికారాలు, హెచ్ఎండీఏకు ఉండాల్సిన అధికారాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో పరిమితులపై స్పష్టతమైన మార్గదర్శకాలు జారీచేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) నిర్మాణం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. మేడ్చల్, శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ఆదాయానికి ఎలాంటి ఇబ్బందిలేకుండా చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఏప్రిల్-మే మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 300 వార్డుల పునర్విభజనపై వస్తున్న విమర్శలు, అభ్యంతరాలను 3 కార్పొరేషన్లుగా విభజన, ఎన్నికల సమయంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

జనవరిలోనే ఫైనల్ నోటిఫికేషన్..

జీహెచ్ఎంసీ 300 వార్డులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ జనవరిలోనే జారీచేసే అవకాశాలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వార్డుల పునర్విభజనపై 5,935 అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించిన అధికారులు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. 30 వార్డులకుపైగా సంబంధించిన పేర్లను మార్చాలని, 75 వార్డులకు పైగా సరిహద్దులను మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Next Story