MLC Kavitha : బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి : ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-13 07:44:41.0  )
MLC Kavitha : బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలి : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై కాంగ్రెస్ ప్రభుత్వాని(Congress Government)కి చిత్తశుద్ధి ఉంటే శాసన సభలో విద్య, ఉద్యోగాలలో, రాజకీయ రిజర్వేషన్లపై వేర్వేరుగా మూడు బిల్లులు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి కన్వీనర్ కవిత(MLC Kavitha)డిమాండ్ చేశారు. జనగామ పెంబర్తిలో అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటే అది మభ్యపెట్టడమే అవుతుందన్నారు.

కేసీఆర్ సమగ్ర సర్వేలో బీసీలు 52శాతం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో తప్పుడు లెక్కలు చేసి 46శాతమని తేల్చారని..దాని ప్రకారం 46శాతం విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రెండు బిల్లులు, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ హామీ మేరకు 42శాతం రాజకీయ రిజర్వేషన్లతో మరో బిల్లు పెట్టాలన్నారు. బిల్లు పెట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా తాత్సర్యం చేసి కోర్టు వివాదాల పాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా మాకు సమాచారం ఉందన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి కుల గణన రీ సర్వే ప్రకటించారని..దీనిపై విస్తృత ప్రచారం చేసి అందరి లెక్కలు నమోదు చేసుకోవాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీల ఉప కులాల నమోదు కూడా జరిపించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రకటన తొలి విజయమేనని బిల్లు సమగ్రంగా పెట్టి అమలు జరిగే వరకు సంఘటిత ఐక్య పోరాటాలు చేయాలని బీసీ నాయకులు, మేధావులను కోరుతున్నానని తెలిపారు. జాగృతి బీసీల హక్కుల కోసం విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. 13ఏళ్ల క్రితమే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేశామని..తదుపరి బీసీసంఘాలతో బీసీల రిజర్వేషన్ సాధనకు పోరాటం చేపట్టిందని..దీంతో భయపడిన కాంగ్రెస్ బీసీ కులగణన చేపట్టిందన్నారు.

మాట ఇచ్చి ఢోకా చేయడం కాంగ్రెస్ కు అలవాటని అందుకు బీసీ బిల్లు సాధించే వరకు పోరాటాలు సాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చొరవతో జనగామ జిల్లాగా ఏర్పడిందని, కలెక్టరేట్, మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. పెంబర్తిని పర్యాటక కేంద్రంగా, హస్త కళల్లోనూ అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు.

Next Story

Most Viewed