రేషన్‌ డీలర్ల నియామకాల్లో అక్రమాలు?

by velandi.Saikiran |   (  Updated:2026-06-05 21:30:10  IST  )

కరీంనగర్ రెవెన్యూ డివిజన్​లో ఖాళీ అయిన రేషన్‌ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

రేషన్‌ డీలర్ల నియామకాల్లో అక్రమాలు?
X

రేషన్‌ డీలర్ల నియామకాల్లో అక్రమాలు.. ?

అర్హత పరీక్షలో ఎక్కువ మార్కులు

వచ్చినా ఇంటర్వ్యూలో జీరో

కలెక్టర్ కు పిర్యాదు చేసేందుకు

సిద్ధం అవుతున్న అభ్యర్థులు

దిశ, కొత్తపల్లి : కరీంనగర్ రెవెన్యూ డివిజన్​లో ఖాళీ అయిన రేషన్‌ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి కేటాయించడం, మరి కొన్ని చోట్ల ఇంటర్వ్యూలో అవకతవకలు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్హత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో జీరో మార్కులు వేసి అనర్హులను ఎంపిక చేసినట్లు తెలుపుతున్నారు. డిగ్రీ, పీజీ చదివిన వారి కంటే పదో తరగతి చదివిన వారికి, ఒక పార్టీ అనుచరుల పైరవీలకు తలొగ్గి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

అర్హతలు నిబంధనలు ఇలా

అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, చౌకధరల దుకాణం పరిధిలో నివాసముండాలి. 18-40 ఏళ్లలోపు వారు అర్హులు. ప్రజాపంపిణీ వ్యవస్థ అధికారులకు దగ్గరి బంధువు అయి ఉండరాదు. రాత పరీక్ష మే 15వ తేదీ లోపుపూర్తి చేయాలి. ఎక్కువ మార్కులు వచ్చిన వారిని 1:5 నిష్పత్తిలో పిలిచి మే 28న కరీంనగర్ ఆర్డీవో కార్యాలయంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి. అని నిబంధనలు ఉన్నాయి .

ఆరోపణలు ఇలా

కరీంనగర్ జిల్లా నగునూర్ గ్రామంలో రేషన్ డీలర్ షాప్ నెం 2036170 లో మే 20 వ తేదీన రేషన్ డీలర్ల కోసం రాత పూర్వక పరీక్ష లు నిర్వహించారు. మే 29 న పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అధిక మార్కులు వచ్చిన వారికి డీలరు ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇచ్చారని నగునూరు కి చెందిన యువకులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బెల్వాంతపూర్ నివాసి మరియు మాతా శిశులో ఉద్యోగికి గా పని చేస్తున్న వారికి డీలర్ కేటాయించారని ఆరోపించారు. అయితే సదరు అభ్యర్థి కి అర్హత మార్కుల లేవు అని వారిని నగునూరు స్వస్థలం కాదని తెలిపారు. మరియు ఒక ఎంప్లాయి కి డీలర్​ఎలా ఇచ్చారు.. అనే దానిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి చేపట్టాల్సి ఉంది..

ఖాళీలు.. ఇలా ఎంపిక జరిగింది..

కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల రేషన్ డీలర్ ల ఖాళీ పోస్టుల భర్తీకి మార్చి 28 న 68 షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా ఉన్నతాధికారుల ఆదేశాల తో కోర్టు కేసు పరిధిలో ఉన్న మరో 26 డీలర్ల భర్తీ కి ఆర్డీవో నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 26 షాపులకు నోటిఫికేషన్ రాగా 17 రేషన్ షాపుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. ఇందులో మూడు షాపులకు ఎలాంటి అప్లికేషన్లు రాలేదు. మొత్తంగా 73 మంది అభ్యర్థులు రేషన్ షాపులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించగా ఈ పరీక్షలకు 68 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 45 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే వీరికి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించగా 44 మంది మాత్రమే హాజరయ్యారు.. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో కేవలం 13 మందిని మాత్రమే అధికారులు ఎంపిక చేశారు.. అయితే ఇందులో ఇంటర్వ్యూల ద్వారా 8 మందిని అధికారులు ఎంపిక చేయగా మరొక ఐదు షాపులకు కేవలం ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు..

Next Story