అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్‌, శంకుస్థాపన చేయ‌నున్న సీఎం రేవంత్

by velandi.Saikiran |   (  Updated:2026-06-05 22:30:49  IST  )

కోహెడ ఫ్రూట్‌ మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్‌, శంకుస్థాపన చేయ‌నున్న సీఎం రేవంత్
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కలగానే మిగిలిపోయిన కోహెడ ఫ్రూట్‌ మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక హంగులతో మార్కెట్‌ నిర్మాణాన్ని చేపడుతోంది. గతంలో అనుకున్న స్థలంలో కాకుండా ప్రస్తుత ప్రభుత్వం స్థల మార్పు చేసింది. ఓఆర్‌ఆర్‌ పక్కనే 239 ఎకరాల్లో నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకు కేబినేట్‌ ఆమోదం కూడా తెలిపింది. రూ.2,284 కోట్ల వ్యయంతో మూడు విడతల్లో చేపట్టనున్న పనులకు శనివారం సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

ఇదీ పండ్ల మార్కెట్‌ క(వ్య)థ!..

ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరలించింది. ఓఆర్‌ఆర్‌కు పక్కనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించి మూడేళ్ల క్రితం కోహెడలో తాత్కాలికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గాలి దుమారానికి రేకుల షెడ్లన్నీ కూలిపోయాయి. దీంతో మార్కెట్‌ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పండ్ల మార్కెట్‌ను కోహెడ్‌కు చేరువలోనే ఉన్న బాట సింగారంలోని హెచ్‌ఎండీఏ లాజిస్టిక్‌ పార్క్‌‍కు తరలించారు. 2001 అక్టోబరు నుంచి బాట సింగారంలోనే పండ్ల మార్కెట్‌ కొనసాగుతోంది. నిత్యం ఇక్కడి మార్కెట్‌కు తెలుగు రాష్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్టాల నుంచి వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. రంజాన్‌ మాసంలో ముంబయి నుంచి ఖర్జూర భారీగా ఇక్కడకు దిగుమతి అవుతుంది. వేసవిలో రికార్డు స్థాయిలో మామిడి పంట్ల విక్రయాలు జరుగుతాయి. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచే పండ్ల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ప్రతి యేటా ఇక్కడి పండ్ల మార్కెట్‌లో రూ.1500 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. ఇక్కడి మార్కెట్టులో 306 మంది లైసెన్స్‌‍డ్‌ కమీషన్‌ ఏజెంట్లు పనిచేస్తున్నారు. మార్కెట్‌ నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏతో పాటు ప్రైవేటు వ్యక్తలకు సంబంధించిన స్థలాలను అద్దెకు తీసుకున్నారు. ప్రతి నెలా అద్దె రూపంలో స్థలాల యజమానులకు రూ.66 లక్షల వరకు చెల్లిస్తున్నారు. 2021 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు రూ.24 కోట్లలకు పైగా అద్దె చెల్లించడంతో మార్కెట్‌‌కు వచ్చే ఆదాయం అంతా అద్దెలకే సరిపోతోంది. మరోపక్క కోహెడలో మార్కెట్‌ నిర్మాణం కోసం 65 మార్కెట్‌ కమిటీల నుంచి రుణ రూపంలో తీసుకున్న రూ.314 కోట్లు ఖాతాలో మూలుగుతున్నాయి. శాశ్వత ప్రాతిపాదికన కోహెడలో మార్కెట్‌ను ఏర్పాటు చేస్తే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిగులుబాటు కలిగే అవకాశం ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయలేదు. కలగా మారిన మార్కెట్‌ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాకారం కాబోతున్నది.

సకల హంగులతో సమీకృత మార్కెట్‌..

గత ప్రభుత్వ హయాంలోనే డిజైన్లు రూపొందగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎస్టిమేషన్లతో పాటు డిజైన్లలో మార్పులు చేపట్టింది. రెండు వందల ఎకరాల్లో పండ్ల మార్కెట్‌ కోసం రూపొందించిన గత ప్రణాళికలోనూ మార్పులు చేశారు. మూడు విడతల్లో పండ్లతో పాటు పాలు, మాంసం క్రయ విక్రయాలు జరిగేలా సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి జాతీయ మార్కెటింగ్‌ మండలితో డీపీఆర్‌‌ను రూపొందించారు. గతంలోనూ హర్యానా రాష్ట్రంలోని గనౌర్‌‌లో 545 ఎకరాల్లో రూ.6వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం అవుతున్న పండ్ల మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం పరిశీలించింది. షెడ్ల నిర్మాణం, కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు, పండ్ల ఎగుమతులకు ఎక్స్‌‍పోర్టు జోన్‌ తదితర వాటిని సకల హంగులతో నిర్మించనున్నారు. రహదారులు, వాహనాల పార్కింగ్‌ తదితర సదుపాయాలకు డిజైన్‌ చేస్తున్నారు. అతి పెద్ద ఐకాన్‌, దానిపై హెలిప్యాడ్‌ నిర్మాణం మార్కెట్‌‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. గతంలో అనుకున్న స్థలంలో కాకుండా ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉన్న సర్వే నెం.167లో మార్కెట్‌ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం చేపట్టనున్నది.

Next Story