గ్రానైట్ దందాపై సర్కార్ ఫోకస్..గులాబీ గూటిలో గుబులు!

by velandi.Saikiran |   (  Updated:2026-06-05 23:00:24  IST  )

ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రానైట్ సంస్థలు వందల కోట్ల రూపాయల జరిమానాను ఎగవేశారంటూ 2013 నుంచి జిల్లాలో చర్చ జరుగుతోంది.

గ్రానైట్ దందాపై సర్కార్ ఫోకస్..గులాబీ గూటిలో గుబులు!
X

దిశ, కరీంనగర్ బ్యూరో : గ్రానైట్ దందాపై సర్కార్ దృష్టి సారించిందా? మాజీ మంత్రులే టార్గెట్ గా పావులు కదులుతున్నాయా? సర్కార్ దూకుడుతో గులాబీ గూటిలో గుబులు మొదలయ్యిందా?... అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఏళ్ల తరబడి సాగుతున్న దందాపై అనేక అరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో సాగిన దందాపై కాంగ్రెస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడం సర్వత్రా ఆందోళన నెలకొంది. విచారణ వెనుక ఆంతర్యమెంటీ మాజీమంత్రులే లక్ష్యంగా విచారణ సాగనుందా? ఇదివరకు జరిగిన విచారణలో తేల్చింది ఏంటీ? అనే చర్చా జోరందుకుంది

గ్రానైట్ వ్యాపారుల్లో మొదలైన గుబులు

ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గ్రానైట్‌ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇక్కడ దొరికే గ్రానైట్‌ రాయికి దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అందుకు తగ్గట్టుగానే గ్రానైట్‌ పరిశ్రమ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందింది. గుట్టలను పిండి చేస్తూ కొందరు గ్రానైట్ వ్యాపారంతో అక్రమ దందా సాగిస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపించే పనిలో నిమగ్నమయింది. ఉమ్మడి జిల్లాలో గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టి గ్రానైట్ అక్రమార్కులకు దడ పుట్టించారు. పది కేసులు నమోదు చేసి ఆరు కోట్ల 16 లక్షల జరిమానా విధించారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ బ్లాక్ లకు సప్లై చేయడంతో 9ఏళ్ల క్రితమే 320 గ్రానైట్ సంస్థలు ప్రభుత్వానికి సుమారుగా రూ.125 కోట్ల రూపాయల మేరకు సీనరేజి పన్ను ఎగవేశారని విజిలెన్సు విచారణలో తేల్చడంతో జరిమానాను ఐదు రెట్లకు పెంచి 750 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో వ్యాపారులు కొంత మేరకు జరిమానా చెల్లించి ఫెనాల్టీని తగ్గించాలంటూ అప్పటి సర్కారుపై ఒత్తిడి తేవడం.. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పడ్డాక కేవలం 11 కోట్లు మాత్రమే చెల్లించి గ్రానైట్ వ్యాపారులు చేతులు దులుపుకున్నారు. గ్రానైట్ అక్రమదందా పై ఈడీ, సీబీఐకి ఫిర్యాదులు అందడంతో రెండేళ్ల క్రితం తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో గ్రానైట్ వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు.

గ్రానైట్ దందా పై రాజుకుంటున్న రాజకీయం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చోటు చేసుకున్న మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా కలకలం రేపుతోంది. మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ కేంద్రంగా పలు ఆరోపణలు రావడం, పెద్ద ఎత్తున విచారణలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగడం .. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి విచారణ జరిపిస్తామంటూ ప్రకటన చేసిననేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలోనే గ్రానైట్ వ్యాపారానికి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నది. ఈ క్రమంలో 2014 నుంచి 2023 వరకు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన వైనం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబం పెద్ద దిక్కుగా నిలిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో తొలుత హరీష్ రావు, తర్వాత కేటీఆర్ మైనింగ్ శాఖలను నిర్వహించారు. దీంతో ఈ ముగ్గురు మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందంటూ ప్రచారం జరుగుతోంది.

గులాబీ నేతలు టార్గెట్ గా విచారణ?

ఖమ్మం జిల్లాలో జరిగిన మైనింగ్ అక్రమాలకు సంబంధించి గంగుల సన్నిహిత బంధువు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాత్రను కూడా లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. గ్రానైట్ అక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరోవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గులాబీ నేతలను ఇరుకున పెట్టడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటు బీజేపీ సైతం బీఆర్ఎస్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం .

గత ప్రభుత్వం కనుసన్నల్లో సిండికేట్ దందా?

2014లో బీఆర్ఎస్ సర్కారు కొలువు దీరిన తర్వాత గ్రానైట్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం మొత్తం జరిమానాను రద్దు చేసింది. దీంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నా రు. అనూహ్యంగా ఈడీ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. అనధికారికంగా గ్రానైట్ ను ఎగుమతి చేసి విదేశీ చెల్లింపులు హవాలా మార్గంలో జరిగాయంటూ ఈడీ 8 గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అనేక అవకతవకలు, అక్రమాలు ఈడీ విచారణలో వెలుగు చూసాయి.

ఎటూ తేల్చని తనిఖీలు?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్ గ్రానైట్ వ్యాపారంలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు న్యాయవాదులు గంగాధర్, బేతి మహేందర్ రెడ్డి, అప్పటి వైసీపీ నేత భాస్కర్ రెడ్డితో పాటు బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు కూడా కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో పలుమార్లు సీబీఐ, ఈడీ, విజిలెన్స్ సహా వివిధ శాఖల అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించడం.. రికార్డులు పరిశీలించడం పరిపాటిగా మారింది. ఒకటి, రెండుసార్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలతో ఏం తేల్చారో ఇప్పటి వరకు ఎవరికి అంతుచిక్కడం లేదు .

చర్యలు ఉంటాయా ?విచారణకే పరిమితమా?

ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రానైట్ సంస్థలు వందల కోట్ల రూపాయల జరిమానాను ఎగవేశారంటూ 2013 నుంచి జిల్లాలో చర్చ జరుగుతోంది. నోటీసులు ఇస్తున్నారు. వ్యాపారులు వివరణ ఇస్తున్నారు. తనిఖీలు జరుగుతున్నాయి.. రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నారు. మీడియాలో అక్రమాలపై అడ్డగోలు కథనాలు వస్తున్నాయి.. అయినా చర్యులు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణ జరిపించాలని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ నేతల వ్యవహారం తేల్చాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేక గతంలో జరిగిన విచారణల్లాగే కాగితాలకే పరిమితమవుతుందా అన్న దానిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఆందోళన కలిగిస్తున్న గ్రానైట్ విద్వంసం

గ్రానైట్ దందా రాజకీయ రంగు పులుముకుని అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అక్రమ దందాపై ప్రజాసంఘాలు, భూరక్షణ సమితి, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ దందాతో ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవడంతోపాటు జిల్లాలో 700 పైగా గుట్టలు మాయమయ్యాయి. మరో 800 గుట్టలను మాయం కాబోతున్నాయి. కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు చారిత్రక సంపద, పురాతన ఆలయాలు ఉన్న గుట్టలను వదలకుండా గ్రానైట్ వ్యాపారానికి అనుమతులు ఇవ్వడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది. అధికారుల అవినీతి, ప్రజాప్రతినిధుల అండదండల నేపథ్యంలో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటున్నా మొక్కుబడిచర్యలతో అక్రమదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సర్కార్ అక్రమదందాపై కొరఢా ఝుళిపించి పర్యావరణాన్ని కాపాడాలని జనం కోరుతున్నారు.

Next Story