తెలంగాణపై కుట్రలు చేసేది ఆ మూడు పార్టీలే.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-26 07:53:36  IST  )

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారు.

తెలంగాణపై కుట్రలు చేసేది ఆ మూడు పార్టీలే.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ.. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడి.. నేడు జై డిల్లీ, జై సోనియా, జై మోదీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డేనని ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీ స్పీకర్‌కు ఇచ్చిన వ్యక్తి ఇదే రేవంత్ కాదా.. సెటైర్లు వేశారుజ ఉద్యమకారులపై తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా ఆయన మిగిలిపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు మొదలు ఆ తర్వాత రేవంత్ పేరు వస్తుందని హరీశ్ రావు అన్నారు.

సింహాలు చరిత్ర చెప్పనంత కాలం.. వేటగాడు చెప్పిందే కథ అన్నట్లుగా కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ పోరాటం, ఉద్యమం చరిత్రగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో మన అస్తిత్వంపైనే దెబ్బ పడుతుందని తెలిపారు. అన్ని విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే.. పుస్తకాల్లో కేసీఆర్ పేరు తొలగించారని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మను తొలగించారని గుర్తు చేశారు. ఏనాడు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయని చరిత్ర రేవంత్ రెడ్డిదని అరోపించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమం చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేసే కుట్ర చేస్తోందని అన్నారు. ప్రపంచంలో ఏ పోరాటం అయినా యువత‌తోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 1969 ఉద్యమం, మలి దశ, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్రే అత్యంత కీలకమని అన్నారు. రాజకీయాల్లో ఎంతో మంది యువకులను కేసీఆర్ రాజకీయాల్లో తీసుకొచ్చారని.. యువత నుండే నాయకత్వం పుడుతుందని హరీశ్ రావు తెలిపారు.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పట్ల ఓ విజనరీ ఉన్న నాయకుడని హరీశ్ రావు అన్నారు. రాజకీయ కక్ష సాధింపు తనకు వద్దు, తెలంగాణ ప్రగతే తనకు ముద్దు అని చెప్పిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ ట్యాగ్ లైన్‌తో గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించిన అపర భగీరథుడు తమ అధినేత అని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.62 లక్షల బడ్జెట్ మూడు లక్షల దాకా తెచ్చామని, 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించామని అన్నారు. కానీ, ప్రస్తుతం నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయని కామెంట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణ‌పై కుట్రలు చేస్తున్నాయని.. నీటి దోపిడీపై ఆ కుట్రలను బద్దలు కొట్టాలని హరీశ్ రావు అన్నారు.

Next Story