- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రభుత్వ శాఖలపై అవినీతి మరకలు.. అడ్డంగా దొరికినా బేఖాతరు
రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ర్టేషన్, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, విద్యుత్, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ర్టేషన్, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, విద్యుత్, ఎక్సైజ్, ఇరిగేషన్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఏసీబీ దాడుల్లో ఆ శాఖలకు చెందిన అధికారులే అధిక సంఖ్యలో పట్టుబడుతుండటమే అందుకు బలమైన సాక్ష్యం. అలాగే, ఆ శాఖలకు చెందిన అధికారుల అవినీతిపైనే పెద్ద ఎత్తున ఏసీబీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఆ శాఖల్లో ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేస్తుంటారని, ఆ మొత్తం ముట్టచెబితేనే పనులు అవుతాయని, లేదంటే ఎంతటి స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా ఇబ్బందులు తప్పవనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.
మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోనే ఎక్కువ కరప్షన్..
ప్రతినెలా సగటున 15 మంది అధికారులను ఏసీబీ ట్రాప్ చేస్తున్నది. అందులో సగం కన్నా ఎక్కువ మంది మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులే ఉంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖల్లో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఆధికారులు లంచాలు ఇవ్వకపోతే పనులు చేయరని పబ్లిక్ ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. కొందరు మున్సిపల్ కమిషనర్లు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు, లే అవుట్ పర్మిషన్లు, ఎల్‌ఆర్ఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చే విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటర్ వర్క్స్ విభాగంలోని అధికారులు డబ్బులు ఇవ్వకపోతే నల్లా కనెక్షన్ ఇవ్వట్లేదని ఫిర్యాదులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టదారు పాసు పుస్తకాలు, భూ బదలాయింపు, నాలా సర్టిఫికెట్లు జారీ టైంలో పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో బర్త్, డెత్, రెసిడెన్స్ సర్టిఫికెట్స్ జారీ సమయంలో ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ ఆఫీసుకు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం.
రిజిస్ట్రేషన్ శాఖలో ఖచ్చితమైన రేటు
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈసీ నుంచి మొదలుకుని, డాక్యుమెంట్ వరకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తుంటారని ఆరోపణలున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక సాకు చెప్పి డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేస్తుంటారని.. దీనితో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పనికోసం వెళ్లే ప్రతి వ్యక్తి ఎంతో కొంత లంచం ఇవ్వక తప్పదనేది బహిరంగ రహస్యంగా ఉన్నది.
పోలీసు శాఖలో చెప్పనక్కరలేదు..
మున్సిపల్, రెవెన్యూ అధికారుల తర్వాత ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లలో పోలీసు అధికారులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో అవినీతి రొటీన్‌గా మారిందని పబ్లిక్ ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. అటు ఫిర్యాదు దారుడి నుంచి ఇటు నిందితుడి నుంచి మామూళ్లు డిమాండ్ చేయడం రొటీన్ అయ్యిందని టాక్. హెడ్ కానిస్టేబుల్, ఎస్సై, సీఐ, డీఎస్పీ వరకు ఒక్కో స్థాయి అధికారికి ఒక్కో రేటు ఉంటుంది. సివిల్ కేసుల సెటిల్మెంట్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులకు లంచాలు ఇవ్వకపోతే పనిచేయని పరిస్థితి. ప్రతి కమర్షియల్ బిల్డింగ్‌కు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సంబంధిత ఫైర్ స్టేషన్ అధికారులకు లంచాలు ఇచ్చాకే పని ప్రారంభం అవుతుందని ఆరోపణలున్నాయి.
ట్రాన్స్‌పోర్టులో బహిరంగ రహస్యం
రవాణా శాఖలో ఏ పనికి ఎంత ఇవ్వాలో ముందుగానే డిసైడ్ చేసి ఉంటుంది. టూ వీలర్ రిజిస్ట్రేషన్‌కు ఓ రేటు, ఫోర్ వీలర్‌కు మరో రేటు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌కు ఇంకో రేటు, చివరికి డ్రైవింగ్ లైసెన్స్‌కు సైతం మామూళ్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య క్షేత్రస్థాయి తనిఖీల్లో ఓవర్ లోడ్ ఉన్న వెహికల్స్ విషయంలో పబ్లిక్ గానే లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఏసీబీకి అందినట్లు తెలుస్తున్నది.
కరెంట్ కనెక్షన్‌కూ లంచం ఇవ్వాల్సిందే..
విద్యుత్ శాఖలో కొత్తగా కరెంట్ కనెక్షన్ ఇవ్వాలంటే అడిగినంత లంచం ఇవ్వక తప్పదు. ప్రధానంగా నగర, పట్టణ శివార్లలో నిర్మించే అపార్ట్‌మెంట్స్, ఇండిపెండెంట్ ఇళ్లకు కరెంటు కనెక్షన్ కోసం పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే నగర శివారుల్లో పోస్టింగ్ కోసం అధికారులు తాపత్రయపడుతుంటారని టాక్ ఉంది. ఇక గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లకు సైతం రైతుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైసా ఇవ్వకపోతే ఉచితంగా అందించే కరెంట్ పోల్ కూడా ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి.
ఒక్కో వైన్ షాపునకు ఒక్కో రేటు..
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అధికారులు ప్రజల నుంచి నేరుగా లంచాలు తీసుకునే వెసులుబాటు లేదు. కానీ వైన్‌షాపులు, బార్లు, బెల్ట్ షాపుల నుంచి ప్రతి నెలా మామూళ్లు వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ మధ్య అది కాస్త మరీ ఎక్కువైందని, దీనితో క్షేత్రస్థాయిలో గుడుంబా, ఆన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఏసీబీ డీజీగా పనిచేసే సమయంలో సీవీ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
వెంచర్ దరఖాస్తు వస్తే అధికారులకు పండగే..
ఇరిగేషన్ శాఖలో పనిచేస్తోన్న అధికారులకు వెంచర్ అనుమతి కోసం దరఖాస్తు వస్తే ముఖంలో సంతోషం కనపడుతుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్ఓసీ సర్టిఫికెట్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పించుకోవాలి. లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వరు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే మున్సిపల్ లేదా డీటీసీపీ విభాగం సంబంధిత వెంచర్‌కు అనుమతి ఇస్తుంది. అందుకని ఇరిగేషన్ అధికారులకు రియల్టర్లు పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వడం సాధారణంగా మారినట్లు టాక్. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చే సమయంలో అవి చెరువులు, కుంటలు, కాలువల పరిధిలో లేవని ఫీల్డ్ విజిట్ చేసి ఇరిగేషన్ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, పెద్ద ఎత్తున లంచాలు వస్తుండటంతో ఎన్ని ఉల్లంఘణలు ఉన్నా.. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అధికారులు పట్టించుకోకుండా అనుమతులు మంజూరు చేస్తున్నారని లేదని ఆరోపణలు ఉన్నాయి.
ప్రతిఏటా 170 మంది ట్రాప్
ప్రతిఏటా ఏబీసీకి పట్టుపడే అవినీతి అధికారుల సంఖ్య సగటున 170 వరకు ఉంటున్నట్లు సమాచారం. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్న వారిలో ఆఫీసర్లే అధికంగా ఉంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసుల్లో తక్కువ మందిపై ఆఫీసర్ల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు ఉన్న ఆఫీసర్లను ఏరివేయడం ఎక్కువైంది. ఏ చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. 2022లో 107 మంది, 2023లో 87 మందిపై అవినీతి కేసులు నమోదయ్యాయి. 2024లో 216, 2025 అగస్టు చివరి వరకు 179 కేసులు నమోదయ్యాయి.
రెగ్యూలర్‌గా సీఎంఓకు రిపోర్టు
ఏసీబీ విభాగం సీఎం పరిధిలో పనిచేస్తుంటుంది. అందుకని ప్రతినెలా జరిగే ఏసీబీ దాడుల వివరాలు, అవినీతి తిమంగళాల డిటేయిల్స్‌ను రెగ్యూలర్ గా సీఎంఓకు అందిస్తుంటారు. అలాగే ప్రతి ఏడాదీ ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. ఎన్ని విచారణ దశలో ఉన్నాయి. ఎన్ని కేసుల్లో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్నది అనే అంశాలపై ఏసీబీ అధికారులు రిపోర్టులు ఇస్తున్నట్లు తెలిసింది.






