CM Revanth Reddy: ఇది మీ ప్రభుత్వం.. మీ కష్టసుఖాల్లో తోడుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన 44 మంది హైదరాబాద్ వాసుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా అందజేశారు.

CM Revanth Reddy: ఇది మీ ప్రభుత్వం.. మీ కష్టసుఖాల్లో తోడుంటాం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతేడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో (Madina Bus Tragedy) మరణించిన 44 మంది హైదరాబాద్ వాసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని (Ex-gratia Distribution) అందించింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన ఒక సర్వైవర్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

మీ కష్టాల్లో తోడుంటాం:

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాధారణంగా దేశం వెలుపల జరిగే ప్రమాదాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించవు. కానీ ఈ ప్రమాదం ఎంతటి విషాదకరమైనదో గుర్తించి బాధితుల కుటుంబాల పరిస్థితిని చూసి రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా ఈ సాయం చేయడానికి నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఆపద సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఇది మీ ప్రభుత్వం, మీ కష్టసుఖాల్లో తోడుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను మదీనాకు పంపినట్లు సీఎం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజిద్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story