మావోయిస్టు పార్టీ చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే.. మల్లోజుల సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-02-20 11:52:32  IST  )

ఆలోచనలు, ఆయుధాలను నియంత్రించాల్సిన పార్టీ ఆర్మీ విభాగం నియంత్రలోకి వెళ్లిపోయిందని మాజీ మావోయిస్టు మల్లోజుల వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టు పార్టీ చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే.. మల్లోజుల సెన్సేషనల్ కామెంట్స్
X

డైనమిక్ బ్యూరో: మారిన పరిస్థితుల వల్లే సాయుధ పోరాటాన్ని వదిలేయాల్సి వచ్చిందని మాజీ మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ భూపతి అలియాస్ సోనూ అన్నారు. 1980లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని పరిస్థితులను అర్థం చేసుకుని తాము బయటకు వచ్చామన్నారు. విప్లవ పార్టీగా మారాల్సిన విధంగా మావోయిస్టు పార్టీ మారలేక పోయిందన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఆలోచనలు, ఆయుధాలను పార్టీ నియంత్రించాలి కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరిగిందని పార్టీకి బదులు ఆర్మీ (సాయుధ విభాగం) పార్టీని నియంత్రించేలా పరిస్థితులు కొనసాగాయన్నారు. ఇది మావోయిస్టు పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటు అన్నారు.

నాడు ఒప్పు నేడు తప్పు:

మావోయిస్టు పార్టీకి (Maoist Party) ప్రజల మద్దతు తగ్గడానికి మేము ఎంచుకున్న మార్గంలో వెళ్లకపోవడమేనన్నారు. సాయుధపోరాటంలో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితులు ప్రస్తుతం లేవని అందుకే వాటిని వదిలేసి మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజల వద్దకు వెళ్లేందుకు అడవులను వదిలి బయటకు వచ్చామన్నారు. ఒకప్పుడు ఆయుధాలు కలిగి ఉండటం సరైనదే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయుధాలు ఆటంకంగా మారాయన్నారు. ఇది గమనించే తాము సాయుధ మార్గాన్ని వదలి రాజ్యాంగబద్ధమైన మార్గంలోకి వచ్చామన్నారు. 1980లలో ఉన్న పరిస్థితులు ఆ తర్వాత తర్వాత లేవన్నారు. ముఖ్యంగా భారతదేశంలో లిబరలైజేషన్ తర్వాత పరిస్థితులు బలంగా మారాయన్నారు. ఆ మార్పులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని భావించి ప్రధాన ప్రవాహంలోకి వచ్చామని చెప్పారు.

దేవ్ జీని ఎవరు ఎన్నుకున్నారు?:

సాయుధ పోరాటం వీడాల్సిన పరిస్థితులపై ఆలోచనలు 2003 నుంచే మొదలయ్యాయి. 2023–24 ప్రాంతంలో తుపాకీ వదలాల్సిన సమయం వచ్చిందని స్పష్టమైందన్నారు. ఈ విషయాన్ని గతంలోనే బసవరాజు, గణపతి వంటి నేతలతో చర్చజరిగిందన్నారు. తన సరెండర్‍‍పై రకరకాల పుకార్లు వస్తున్నాయని తాను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేశానన్నారు. నేను బయటకు వచ్చాక మిగతా వాళ్లు వస్తున్నారటే నేను ఎంచుకున్న మార్గం సరైనదేనన్నారు. బస్వరాజు తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీని అధికారికంగా ఎంచుకున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ ఎంచుకోవడానికి అక్కడ ఎవరూ ఉన్నారని ప్రశ్నించారు. ఇదంతా మీడియా సృష్టేనన్నారు. అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు. ఎలాంటి సీసీ మీటింగ్ లు జరగలేదన్నారు. ఇతరు నేతలతో కలిసే పరిస్థితులే అక్కడ లేవన్నారు. తనను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నట్లు ఇప్పటి వరకు దేవ్ జీ ఎక్కడా ప్రకటించుకున్నారా? ఇదంతా మీడియా కథనాలే అన్నారు. నేను ఎప్పుడు ప్రధాన కార్యదర్శి రేస్‍లో లేనని స్పష్టం చేశారు.

తెలంగాణ కమిటీలో ఉన్నది ఒక్కరే?:

కర్రెగుట్టలను తాము సౌత్ సబ్ జోన్ అని పిలుస్తాం. కర్రెగుట్ట ఆపరేషన్-1 జరుగుతున్న సమయంలో అక్కడ 500 మంది మావోయిస్టులు ఉన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ వంటి రకరకాల కారణాలతో ఇక్కడ ఆపరేషన్ ఆగిపోయింది. దాంతో మావోయిస్టులంతా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు. ఈ ఆపరేషన్‍లో తెలంగాణ ప్రభుత్వం మద్దతు మావోయిస్టులకు ఉందా అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటిలో ఒక్కరే ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం విధానం ఏమిటో తాను చెప్పలేనన్నారు. ప్రభుత్వం, పార్టీ వెనుక ఉన్నదేమిటి అనేది తానేం చెప్పలేనన్నారు.

పెద్దనోట్ల రద్దుతో కోట్లలో నష్టం:

పెద్ద నోట్ల రద్దు ప్రభావం మావోయిస్టు పార్టీపై భారీగా పడిందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీకి భారీగా నష్టం సంభవించిందని కోట్లాది రూపాయలు మార్చుకోలేకపోయామన్నారు. మొత్తం నష్టం ఎంతో తనకు తెలియదని కనీసం 20 కోట్ల వరకు నష్టం జరిగినట్లు నా అంచనా అని చెప్పారు. ఎక్స్ చేంజ్ చేసివ్వమని డబ్బులు ఇస్తే వాటిని తిరిగి చాలా మంది ఇవ్వలేదన్నారు. ఎల్‍టీటీఈతో మావోయిస్టు పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన ఇద్దరికి తమ పార్టీతో సంబంధం ఏర్పడింది. వారు 1989లో ల్యాండ్ మైన్, ఇతర పోరాట పద్దతులపై శిక్షణ పొందామన్నారు.

గణపతి ఎక్కడున్నారో తెలియదు:

గణపతి ఎక్కడున్నారన్నది తెలియదన్నారు. ఆయన వయస్సు 70 దాటింది. అడవుల్లో లేరనేది స్పష్టం అవుతోందన్నారు. ఇంకా అడవులు, నగరాల్లో అజ్ఞాతంలో ఉన్నవారు ప్రధాన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా పని చేసేందుకు బయటకు రావాలన్నారు. సమాజంలో వచ్చిన మార్పులను ముందుగా అధ్యయనం చేస్తాను. ప్రజల సమస్యలను రాజ్యాంగ పరిమితుల్లో పరిష్కరించే దిశగా పని చేయాలని భావిస్తున్నాననన్నారు.

Next Story