- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరన్నది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: మాజీ మంత్రి హరీశ్ రావు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన రైతు వీరన్న ఆత్మహత్యపై స్పందించారు. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నానని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనమని అన్నారు. వీరన్నది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్యేనని కామెంట్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పండించిన పంటను కొనే దిక్కు లేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారని హరీశ్ రావు ఆక్షేపించారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా..? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని, అందరికీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమేనని.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని.. అధైర్యపడొద్దంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.






