Gen Z కు కేటీఆర్ ముఖ్యమైన సందేశం.. కోయంబత్తూరులో నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీల్లో ప్రసంగం

by Ramesh Naini |

ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Gen Z కు కేటీఆర్ ముఖ్యమైన సందేశం.. కోయంబత్తూరులో నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీల్లో ప్రసంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. శనివారం (Coimbatore) కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగెత్తినప్పుడు, భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైందన్నారు. ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఫార్ములా ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమే..

ఫార్ములా-ఈ ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమేనని, తెలంగాణ స్థిరమైన, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందని, త్వరలోనే హైదరాబాద్ భారతదేశ మొబిలిటీ వ్యాలీ'గా ఆవిర్భవించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు.. అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోవడం అని, జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలని కేటీఆర్ అన్నారు.

టీ-హబ్ భారత్‌లోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రం..

ఐటీ మంత్రిగా తన హయాంలో, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన (T-Hub) టీ-హబ్, భారత్‌లోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీ-వర్క్స్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఎలా నిర్మించిందో కేటీఆర్ వివరించారు. ఒక ఆలోచన టీ-హబ్ నుంచి టీ-వర్క్స్‌కు వెళ్లడానికి ఒక టీ తాగేంత సమయం మాత్రమే పడుతుందని ఆలోచన అమలు వేగాన్ని చమత్కరించారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా, వాటిని మీరే సృష్టించుకోవాలని యువ ఇంజనీర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మీరు సొంతంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడాలి? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారండని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలామంది సందేహించారని,కానీ, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత, అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాము. తెలంగాణ సాధించిన ప్రగతి విశ్వాసానికి పట్టుదలకు దర్శనికత నిదర్శనం అన్నారు. నేటి యువతరం, Gen Z కు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ, కేటీఆర్.. ‘ఆదాయం కంటే ప్రభావానికి (Impact), అధికారం కంటే ప్రామాణికతకు (Authenticity) ప్రాధాన్యత ఇవ్వాలని, వేగం, విస్తరణ (Speed and Scale) పట్ల ఆకలిని కలిగి ఉండాలని సూచించారు. మీరు ఇతరులు అనుకున్నదాని కంటే తెలివైనవారు, బాధ్యత కలిగినవారు. భారతదేశాన్ని ముందుకు నడిపించేది మీరే’ అని విద్యార్థులకు తెలిపారు. మోటార్‌స్పోర్ట్స్ అయినా, పాలన అయినా, జీవితంలో అయినా విజయం కేవలం యాదృచ్ఛికంగా రాదని, మనం మన అవకాశాలను రూపొందించుకోవాలి, ధైర్యంతో అమలు చేయాలి.. అప్పుడే భవిష్యత్తు నిర్మితమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Next Story