ఇది ప్రజారంజక బడ్జెట్.. నిరుద్యోగ సమస్యకు పెద్దపీట : ఎంపీ ఈటల రాజేందర్​

by Ramesh Naini |   (  Updated:2026-02-01 15:05:33  IST  )

ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తుందని, దూరదృష్టి దీర్ఘకాలిక నిర్ణయాలతో భారత దేశం జీడీపీ ఏడు శాతం పెరిగిందని ఎంపీ ఈటల రాజేందర్​ పేర్కొన్నారు.

ఇది ప్రజారంజక బడ్జెట్.. నిరుద్యోగ సమస్యకు పెద్దపీట : ఎంపీ ఈటల రాజేందర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తుందని, దూరదృష్టి దీర్ఘకాలిక నిర్ణయాలతో భారత దేశం జీడీపీ ఏడు శాతం పెరిగిందని ఎంపీ ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. ఆదివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై స్పందిస్తూ, గత సంవత్సరం రూ. 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెడితే ఈ సంవత్సరం రూ. 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. గంభీరంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్ లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టారు, ఈ సారి కూడా పెట్టారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో బడ్జెట్ పెట్టారు అని తెలిపారు. అనేక మందుల మీద ఇంపోర్ట్ టాక్స్ తగ్గించారు.. క్యాన్సర్ తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మారిస్తే ఆ పథకమే తీసేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి, కానీ గత బడ్జెట్లో రూ. 81 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఈ సారి రూ. 1.50 లక్షల కోట్లపై చిలుకు ఈ బడ్జెట్ పెట్టారని స్పష్టం చేశారు.

గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కల్పిస్తున్నారని ఈటల అన్నారు. దేశ భవిష్యత్తు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆధారపడి ఉంటుందని, గతంలో 11 లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈ సారి రూ. 12 లక్షల కోట్లు పెట్టారన్నారు. ఈ బడ్జెట్ లో ఎక్కువ మాన్ పవర్ కోసం నిధులు కేటాయించారు.. లక్షలాదిమంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ పౌల్ట్రీ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది.. ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.. వికసిత భారత్ 2047 వైపు ప్రయాణించడానికి స్పష్టమైన మార్గ నిర్దేశం చేసింది.. కోట్ల మంది ఆధారపడి ఉన్న సర్వీస్ సెక్టార్ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి దానిని ప్రోత్సహించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మినరల్ హబ్ గా తయారు చేయడం కోసం ప్రత్యేక కారిడార్ ప్రకటించారని పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు నడయాడిన ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చిందని తెలిపారు. బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దాని మీద చాలా సునిశితమైన దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన జరిగిందని అన్నారు.

Next Story