ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్.. బీసీలు, మహిళలను మోసం చేశారు : కవిత

by Bhoopathi Nagaiah |

కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్.. బీసీలు, మహిళలను మోసం చేశారు : కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు, మైనార్టీల ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్‌లో అన్యాయం చేశారని అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు గతేడాది కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా కొత్త బడ్జెట్‌లోనూ పెట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి కనీస విజన్ కూడా లేదని అందుకే ఇది రివిజన్ బడ్జెట్ అంటున్నామని మండిపడ్డారు. ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫేకారని.. కానీ, బడ్జెట్‌లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించి మోసం చేశారన్నారు. లక్షల కోట్లు అప్పులు తెస్తున్న రేవంత్ సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. దాదాపు 8 లక్షల 64 వేల కోట్లు అప్పు చేసి ఒక్కో కుటుంబంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.9 లక్షల అప్పుల భారం మోపిందన్నారు. ప్రజలకు మేలు చేయటం చేతకాని కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్‌తున్నారని మండిపడ్డారు. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వమని విమర్శించారు.

రాహుల్ పూర్తిగా ఫేక్

ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున హామీలిచ్చిన రాహుల్ గాంధీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ ఫేకే అన్నారు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్‌గా నామకరణం చేస్తున్నామన్నారు. సలీం ఫేక్ తన మాటలతో నవ్విస్తే.. రాహుల్‌గాంధీ మాత్రం తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌లో తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న స్కీం ఈసారి కూడా పత్తా లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతేడాదితో పోల్చితే రూ.7 వేల కోట్లు కోత పెట్టారని అన్నారు. కమీషన్లు వచ్చే యంగ్ ఇండియా స్కూళ్లకు మాత్రం రూ.5 వేల కోట్లు కేటాయించారని ఆరోపించారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అన్నింటికి మించిన ఫేక్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అన్నింటికి మించిన ఫేక్ అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ సీఎం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారని.. కానీ నిరుద్యోగంలో మనం రైజింగ్ అవుతున్నామని చెప్పారు. స్త్రీ నిధి విభాగంలో 14 ఏళ్లుగా జి.విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి గత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలను మేనేజ్ చేసి ఇప్పటికీ ఉద్యోగంలో కొనసాగుతున్నారన్నారు. అతను చేసే అక్రమాలపై విచారణ కమిషన్ వేసినప్పటికీ ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే మంత్రి సీతక్క ఎంక్వైరీ చేయించి విద్యాసాగర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు చేయకున్నా.. రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో అవకాశం దక్కని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చని.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.

Next Story