- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మనవడి కోసం వస్తారు, తెలంగాణ కోసం ఎందుకు రారు?’ కేసీఆర్‌కు యెన్నం సూటి ప్రశ్న
కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురండి కాళేశ్వరం అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం అని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురండి కాళేశ్వరం అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం అని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. మీరు మమ్మల్ని ఒప్పిస్తే మూడు సంవత్సరాల పాటు కాళేశ్వరం నిర్వహణ బాధ్యత బీఆర్ఎస్‌కే ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి కాళేశ్వరం సమస్యకు పరిష్కారం చెప్పాలని, దొంగ ఆరోపణలు చేయడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలన్నారు. మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్, తెలంగాణ ప్రజల కోసం ఎందుకు బయటకు రావడం లేదు? అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీశ్‌రావు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే వెళ్తాయని తెలిసి ఇదంతా చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా జెడ్సీటీసీగా, కొడంగల్‌లో ఎమ్మెల్యేగా, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్నారని, వారికి దమ్ముంటే సిద్ధిపేట, సిరిసిల్లలను వదిలి పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణలో ఏ మంచి జరిగినా నచ్చదు!
తెలంగాణలో ఏ మంచి జరిగినా, ప్రజలకు లాభం కలిగినా, అభివృద్ధి జరిగినా కల్వకుంట్ల కుటుంబానికి ఏడుపే అని, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే, మూసీ ప్రక్షాళన చేస్తే, రైతులకు బోనస్ ఇస్తే ఏడుపే, 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినా బీఆర్ఎస్‌కు బాధే అని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని వ్యతిరేకించడమే బీఆర్ఎస్ పని అని, మేడిగడ్డను నిర్మించింది, డిజైన్ మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, వారి హయాంలోనే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం మేడిగడ్డ ప్రాంతం భారీ బ్యారేజీ నిర్మాణానికి అనుకూలం కాదని, ఇప్పుడు బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీ ఊడిపోయి 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయాలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ కాదు
వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ కాదని, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిపుణుల సూచనలతో కాంగ్రెస్ నిర్మించిందన్నారు. సమయం బట్టి డాక్టర్, ఇంజనీర్ అవతారాలు ఎత్తే పగటి వేషగాళ్ళ కుటుంబం బీఆర్ఎస్ అని, మహారాష్ట్రతో 152 మీటర్ల ఒప్పందం చేసుకుని రాజ్‌భవన్‌లో దావత్ చేసుకున్నది బీఆర్ఎస్‌నే అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ముంపు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెట్రో కోసం కేంద్రంతో కృష్ణా, తుంగభద్ర జలాల కోసం పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని, సమస్యలపైన లొల్లి, బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ విధానం కాదని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






