- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఓట్లతో గద్దెనెక్కారు.. హామీలు నెరవేర్చండి: ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలైనా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో మహిళలు ప్రజా భవన్ ముట్టడికి దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నగరంలోని ప్రజా భవన్ (Praja Bhavan) ముట్టడికి పిలుపునిచ్చిన ఆమె, పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం పేరిట నెలకు రూ.2,500 చొప్పున, గత 26 నెలల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు, హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం పంపిణీ చేయాలని కవిత అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతూ వెంటనే జీవో విడుదల చేయాలని ధ్వజమెత్తారు. అదేవిధంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేస్తామన్న హామీ ఇచ్చి వంచించారని ఫైర్ అయ్యారు. అంగన్‌వాడీ (Anganwadi) కార్యకర్తల వేతనాలను వెంటనే పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి..
రాబోయే రాష్ట్ర బడ్జెట్ (Sate Budget)లో సంక్షేమ పథకాలన్నింటికీ సరిపడా నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. కేవలం మాటలతో కాలయాపన చేయకుండా, చేతల్లో చూపించాలని అన్నారు. మహిళల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ (Congress), ఇప్పుడు వారిని విస్మరించడం తగదని ఆమె హెచ్చరించారు. ఈ ఆందోళనలో తెలంగాణ జాగృతి నాయకులతో పాటు వందలాది మంది మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కవిత హెచ్చరించారు.






