మళ్లీ ఆ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తుండ్రు.. BRSపై ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-07 07:43:36  IST  )

కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక పాలనను ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

మళ్లీ ఆ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తుండ్రు.. BRSపై ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక పాలనను ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన దెబ్బకు తట్టుకోలేక తెలంగాణ సెంటిమెంట్ ఆస్త్రాన్ని వాడేందుకు గులాబీ ముఖ్య నేతలు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే తెలంగాణ‌ను విమర్శించిన‌ట్లు‌గా వ్యవహరిస్తుండం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తేనే మాట్లాడరని.. బీఆర్ఎస్ కుట్రపూరిత విధానాలను ప్రజల ముందు పెడితే మాత్రం ఆంధ్రా పత్రికలు అంటూ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. దాడులు చేసిన వారిని తప్పుబట్టకుండా గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ఇంకా దాడులు చేస్తామని బెదిరించడం ఏంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణలో బీహార్ తరహా సంస్కృతిని తీసుకు వస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి బీఆర్ఎస్ నేతల ఆటలు సాగవని.. వారి దగ్గర ఉన్న అస్త్రాలు అన్ని అయిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే కొత్తగా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌‌తో ప్రజల ముందు మార్కులు కొట్టేసేందుకు ముందుకు తెస్తున్నారని ఆక్షేపించారు. రాబోయే స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మని మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే కేటీఆర్ పారిపోయాడని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. టీఆర్ఎస్ పేరు‌ను ఏనాడైతే బీఆర్ఎస్‌గా మార్చారో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఆ పార్టీ పోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఇక నుంచి అయినా జాగ్రత్తగా మాట్లాడాలని ఆది శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story