- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారంలో తోడేస్తున్నారు..! మట్టి మాటున ఇనుప ఖనిజం రవాణా?
అపార ఖనిజ సంపదకు నిలయమైన బయ్యారం ఇనుపరాయి గుట్టల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అపార ఖనిజ సంపదకు నిలయమైన బయ్యారం ఇనుపరాయి గుట్టల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి తరలించేది మట్టి మాత్రమే కాదని.. మట్టి మాటున ఎంతో విలువైన ఇనుప ఖనిజాన్ని సైతం తరలిస్తున్నారని పలువురు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయమై స్థానికులు అధికారులను కలిసి ఫిర్యాదు చేయగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని, అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపణలు రావడం గమనార్హం.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సోలెంవారికుంట సమీప ఇనుపరాయి ఉన్న గుట్ట పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను ఆసరా చేసుకొని కొందరు అక్రమ దందాకు తెరలేపారు. అక్కడ ఉన్న మట్టిని ట్రాక్టర్లు, మినీ లారీల సహాయంతో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతాల్లో భూగర్భంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని సైతం అక్రమ మట్టి తవ్వకాల ముసుగులో తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. మండలంలోని కుంటలు, చెరువు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల జరిపి వ్యాపారం చేస్తున్నట్లు ఇటీవల మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం మట్టి దందాపై ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకపోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికుల ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఖనిమున్న ప్రాంతంలోనే మట్టి దందా..
బయ్యారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 202లోని భూముల్లో గతంలో ఇనుపరాయి లీజుదారుల 2004, 2007 నుంచి 2025 సంవత్సరం వరకు లీజు అనుమతులు పొందారు. అయితే 2007 నుంచి 2009 వరకు లీజుదారులు విలువైన ఇనుపరాయి లారీల్లో ఆంధ్ర ప్రాంతంలోని జగ్గయ్యపేటకు జోరుగా తరిలించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే కొంత కాలం తర్వాత పలు కారణాలతో ఆ ప్రాంతంలో ఇనపు రాయి లీజు రద్దయింది. అక్కడి అపారమైన ఖనిజ సంపద, మట్టిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు చడీచప్పుడు కాకుండా మట్టిని, విలువైన ఖనిజ సంపదను దొంగచాటుగా తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వివనిపిస్తున్నాయి.
అధికారులకు పట్టింపు లేదా..?
మట్టి మాటున ఇనుపరాయిని సైతం తరలిస్తున్నారనే అనుమానాలు నివృత్తి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని, దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నోటీసులూ ఇచ్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ మట్టి దొంగలపై రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలకు ఫిర్యాదులు అందినా తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడమే తప్ప అసలు అక్కడ ఏం జరుగుతుందో తేల్చే పరిస్థితిలో లేరనేది గమనార్హం. మట్టి తరలింపు, అక్కడ జరిగే తతంగంపై ఇటీవలే కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తి సమగ్ర సర్వే చేసి సోలెంవారికుంట సమీపంలో గతంలో ఇనుపరాయి లీజులు ఉన్నాయా.. ఒకవేళ ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులు, అదే ప్రాంతంలో మట్టి తోలకాలపై ఎలా ఎన్వోసీ ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసలు విషయం బయట పెట్టి, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే స్థానికుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతామని పలు రాజకీయ పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు.
మట్టి తోలకాలకు అనుమతులు ఇవ్వలేదు..
సోలెంవారికుంటలో మట్టి తోలకాల విషయం మీడియా ద్వారానే మా దృష్టికి వచ్చింది. దీనిపై సంబంధిత శాఖలు ఇరిగేషన్, మైనింగ్ అధికారులకు లేఖలు కూడా పంపాం. అవి రాగేనే చర్యలు తీసుకుంటాం. ఎవరికీ మండలంలో మట్టి తోలకాలపై అనుమతులు ఇవ్వలేదు. - బయ్యారం తహసీల్దార్ బండి విజయ
నిఘా పెట్టాలి..
1969 లో ఈ ప్రాంతంలో ఇనుపరాయి ముడి ఖనిజంపై ఆంధ్ర పెత్తందారులు కన్నుపడి లక్షల టన్నులు దోపిడీకి గురైంది. ఆ దోపిడీ నేటి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి సమయాల్లో కార్పొరేట్ సంస్థలు ఈ ప్రాంతంలోని ముడి ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించకపోతున్నాయి. దానిని నిలుపుదల చేసి ఇక్కడే ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు సీఎం రేవంత్ సర్కార్ కృషిచేయాలి. అక్రమంగా తరలించే ముడి ఖనిజంపై నిఘా పెట్టాలి. - గౌని ఐలయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి






