తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష ఉండదు: శివరాజ్ సింగ్ చౌహన్

by Prasad Jukanti |

అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు.

తెలంగాణ పట్ల ఎలాంటి వివక్ష ఉండదు: శివరాజ్ సింగ్ చౌహన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ది కార్యక్రమాల్లో ఎలాంటి రాజ‌కీయాల‌కు తావు ఉండ‌ద‌ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలని తెలంగాణతో ఎటువంటి వివక్ష ఉండదు అని హామీ ఇచ్చారు. రాష్ట్ర కేంద్ర సహకారం భారత పురోగతికి అవసరమ‌ని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సు, 25వ కేంద్ర స్థాయి సమన్వయ కమిటీ (CLCC) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ది కోసం రాజ‌కీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వ క‌లిసి వ‌స్తుంద‌ని, అందుకు తెలంగాణ ప్రభుత్వానికి అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ల‌క్ ప‌తి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే కోట్లాది మహిళలు SHGల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారని, తదుపరి లక్ష్యం మరింత విస్తరణేనని చెప్పారు. బ్యాంకర్లు కేవలం రుణదాతలుగా కాకుండా భాగస్వాములుగా మారాలని సూచించారు.

కేంద్ర మంత్రికి సీతక్క విజ్ఞప్తి:

ఈ సదస్సు వేదికపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍కు మంత్రి సీతక్క పలు వినతిపత్రాలను సమర్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపిస్తున్న సోలార్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గడువును రాబోయే ఆర్థిక సంవత్సరాల వరకు పొడిగించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

Next Story