- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రానికి వారంలో మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి వారంలో మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన పడవద్దని సూచించారు. ఆదివారం వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఒక ప్రకటనలో పేర్కొంటూ గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి 2.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిఉండగా, రాష్ట్రానికి 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరిస్తూ రాష్ట్రానికి కేటాయించిన దానిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్క్ ఫెడ్ వద్ద ఉంచిన 3.08 లక్షల మెట్రిక్ టన్నులతో అవసరం మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేశామన్నారు. ఇప్పటికే అధికారులు కేంద్ర అధికారులను కలవడం జరిగిందని, తాను ప్రత్యక్షంగా సంబంధిత మంత్రికి లేఖల ద్వారా మా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో విమర్శలు మాని రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తమ వంతు కృషి చేయాలని కోరారు. పెరిగిన విస్తీర్ణం వినియోగం దృష్ట్యా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ వంతు బాధ్యతగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్ధతు అందిస్తే మంచిదన్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి కేటాయించిన యూరియా వెంటనే సరఫరా చేయాలని కోరినట్లు వెల్లడించారు.
గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే, ఈ సారి నీటి వనరులు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణంలో 5 నుండి 10 శాతం వరకు వృద్ధి నమోదైనట్లు, యూరియా వాడకం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 1.9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వినియోగించినట్లు తెలిపారు. ప్రభుత్వం పంటకాలం ప్రారంభం నుండే నిత్యం సమీక్షించుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వెస్సెల్స్ , రైల్వే వ్యాగన్స్ రావడంలో ఎక్కడైనా, ఏదైనా జిల్లాకు ఆలస్యమైతే వెంటనే పొరుగుజిల్లాల నుండి తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు 81,800 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతుందని తెలిపారు. అధికారులు యూరియా సరఫరా విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, కృత్రిమంగా ఎవరైనా కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు.






