వేతన సవరణ ఉత్తర్వుల్లో బకాయిల ఊసే లేదు.. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన

by Ramesh Naini |

వేతన సవరణ ఉత్తర్వుల్లో బకాయిల ఊసే లేదని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.

వేతన సవరణ ఉత్తర్వుల్లో బకాయిల ఊసే లేదు.. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ ఉత్తర్వుల్లో బకాయిల ఊసే లేదని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏప్రిల్ 22 నుంచి 3 రోజుల పాటు సమ్మెలో పాల్గొని, కేబినెట్ సబ్ కమిటీతో చర్చలు జరిపి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్ యూనియన్లను రెస్టోర్ చేయడం, 2021 వేతన సవరణ అమలు చేయడం లాంటి డిమాండ్లు సాధించుకున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో 2021 వేతన సవరణపై ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని, దానివల్ల కార్మికులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021 వేతన సవరణకు సంబంధించి ఐదేళ్ల వేతన బకాయిల గురించి ఆ ఉత్తర్వుల్లో లేదని, ఇది కార్మికులకు జరిగిన అన్యాయమేనని బాబు పేర్కొన్నారు. 2013 అలవెన్సులు 2021లోనూ కొనసాగుతాయని ఉత్తర్వులు ఇవ్వడంలో అర్థం లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చల్లో 80 శాతం అలవెన్సులు పెంచుతామన్నారని, ఆ విషయాన్ని సర్క్యులర్‌లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 80 శాతం అలవెన్సులు పెంచుతూ వెంటనే సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణలో కార్మికులకు రావలసిన ఎరియర్స్, 2017, 2021లో రిటైరైన కార్మికులకు వేతన సవరణ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్.బాబు డిమాండ్ చేశారు.

Next Story