మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపంగి నూనెట: సీఎంపై హరీశ్‌రావు సెటైర్లు

by Kema Shiva Kumar |

‘మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగి నూనె’ అన్నట్లుగా రాష్ట్రంలో రేవంత్ సర్కారు తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు.

మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపంగి నూనెట: సీఎంపై హరీశ్‌రావు సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగి నూనె’ అన్నట్లుగా రాష్ట్రంలో రేవంత్ సర్కారు తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని కామెంట్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్ల నిధులు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు.. కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం.. ఇదేనా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన ఘనత అని ప్రశ్నించారు. అడుగడుగునా యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆక్షేపించారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రేవంత్ రెడ్డి గారూ.. మీ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని.. విద్యార్థులకు కడుపునిండా మంచి భోజనం పెట్టండి.. అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు."

Next Story