అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు తేడా లేదు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 07:27:21  IST  )

డెస్క్ జర్నలిస్టులకు నష్టం కలిగించే అంశాలను జీవో నెం.252లో సవరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు తేడా లేదు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: డెస్క్ జర్నలిస్టులకు నష్టం కలిగించే అంశాలను జీవో నెం.252లో సవరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలో డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (Desk Journalist Federation of Telangana) ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ కార్డులు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు ఉన్న వారికి కూడా వర్తిస్తుందని అన్నారు. ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, జీవో నెం. 252లో మార్పులు, చేర్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

కానీ, అక్రిడిటేషన్ కార్డుల విషయంలో కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి పొంగులేటి అన్నారు. తమకు ఎవరి పట్ల పక్షపాతం లేదన్నారు. అందరికీ తాను అండగా ఉంటానన్నారు. జర్నలిస్టులను రెండు విభాగాలుగా చూడాలన్న ఆలోచన తమకు లేదని, ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని అన్నారు. అర్హులైన, నిజమైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న సంకల్పం, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మినహా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్టులను కూడా తప్పక ఆహ్వానిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తీసుకుని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో నెం. 252లో మార్పులు, చేర్పులు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, నవీన్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉపేందర్, ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్, నాయకులు నిస్సార్, విజయ్, రాజారాం, స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Next Story