రాష్ట్రంలో అరెస్టుల పర్వం నడుస్తున్నది.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్

by Kema Shiva Kumar |

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.

రాష్ట్రంలో అరెస్టుల పర్వం నడుస్తున్నది.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తున్నదని, అభివృద్ధిని మరచి అక్రమ కేసులపై దృష్టి పెట్టారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దోషులుగా చూస్తున్నారని ఆరోపించారు. పాడి కౌశిక్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రొటోకాల్ అడిగారని.. ప్రొటోకాల్ ఉల్లంఘించడమే కాక ఆయనపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. సీపీ మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఎక్కడా అనలేదని.. ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన స్టేట్మెంట్‌ను అప్పుడే కౌశిక్ రెడ్డి ఖండించారని తెలిపారు. ఈ కేసును సీఐడీకి ఎందుకు ఇస్తున్నారని.. ఈ కేసులో స్కాం ఉన్నదా.. దొంగతనం ఉన్నదా? అని ప్రశ్నించారు. అలాగే.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఎందుకు కస్టడీ కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దని అన్నారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి తాను వీణవంకకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. తమ తల్లిదండ్రులను హౌస్ అరెస్టు చేశారని.. తన మైనర్ బిడ్డను పోలీసులు గుంజుకుని వెళ్లారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ తనను ఇబ్బందులు పెట్టారని అన్నారు. తాను ముస్లింలను తిట్టానని కాంగ్రెస్ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను 50 మందితో వెళ్లినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరోవైపు.. సీఐడీని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటకు తీయాలని అన్నారు. పోలీసులతో కుమ్మక్కై సీఐడీ విచారణ చేస్తున్నారని.. రేవంత్‌రెడ్డి స్క్రిప్ట్ ఏం ఇస్తే అదే చేస్తారా అని నిలదీశారు. వచ్చే మూడేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. ఎవరినీ విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ సీపీ, హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐని సస్పెండ్ చేసే వరకూ పోరాటం చేస్తానన్నారు.

Next Story