- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nalgonda : నర్సింగ్ విద్యార్థులపై మాయ..! వసతుల్లేకపోవడమే కాక అక్రమ స్కాలర్షిప్‌ల దందా!
నర్సింగ్ చదివే విద్యార్థులకు కాలేజీలలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు.

దిశ నల్లగొండ బ్యూరో: (Nursing students) నర్సింగ్ చదివే విద్యార్థులకు కాలేజీలలో కనీస వసతులు కల్పించడంలో మమ్మల్ని మించిన వారు లేరు.. మేమే గొప్పా.. మాకు ఏమైనా ఇబ్బంది జరిగితే.. మా పెద్దాయన అన్నీ చూసుకుంటారు.. ఏదైనా రాసుకోని.. డోంట్ కేర్.. అంటూ ఓ కాలేజీ యజమాని పలికిన ప్రగల్భాలు ఇవి.. అయితే విచిత్రం ఏంటంటే కాలేజీల్లో కనీసం విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలం చెందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
చెట్లకిందనే కిచెన్ రూమ్..!
నర్సింగ్ విద్యలో మేజర్‌గా అమ్మాయిలు ఉంటారు. వారికి తరగతి గదుల్లో కానీ హాస్టల్లో కానీ సౌకర్యాలు కల్పించడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జరగరానిది ఏది జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కానీ (Nursing College) నర్సింగ్ కాలేజీ యాజమాన్యాలు పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలో ఉన్న ఓ కళాశాలలో చెట్ల కిందనే వంటలు చేస్తున్నారు. ఇదేంటి ఇక్కడ చెట్ల కింద చేస్తున్నారు అని అడిగితే.. ‘ఏముంది సార్ 30 నుంచి 40 మంది పిల్లలకు ఎక్కడ చేస్తే ఏముంటుంది, దాదాపు ఇక్కడే వంట చేస్తుంటాం ఎప్పుడైనా’ అని సమాధానం ఇచ్చారు. అది ఎట్లా.. సుమారు 200 మంది వరకు విద్యార్థులు ఉండాలి కదా అని అడిగితే.. ‘ఉండాలి కానీ పరీక్షలకు నెల రోజుల ముందు మాత్రమే వాళ్లంతా ఉంటారు, మిగతా రోజులంతా ఇప్పుడున్న మంది మాత్రమే ఉంటారు’ అని సమాధానం వచ్చింది. మరి కొద్ది మందికైనా కిచెన్ రూమ్‌లో చేసి పెట్టొచ్చు కదా అంటూ తిరిగి ప్రశ్నిస్తే..‘కిచెన్ అంత గలీజ్ చేస్తారు, ఇక్కడైతే ఎలా ఉన్నా సరిపోతుంది’ అంటూ సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను తెలుసుకోవడానికి. వంట చేస్తున్న సమయంలో చెట్టు మీద నుంచి ఏదైనా పురుగులు, విషపు పురుగులు పడితే ఆ భోజనం తిన్న విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు..? కళాశాల యజమాన్యాలకే తెలియాలి.
క్వాలిఫై కానీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్..?
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చదివే విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత అందులో ఉన్న సబ్జెక్టులలో 75 శాతం మార్కులు రావాలి. అలా ఉత్తీర్ణత కాకపోతే రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత స్కాలర్షిప్ కు అర్హత కోల్పోతారని తెలిసింది. కానీ అలా ఫెయిల్ అయిన విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా పొందేందుకు యాజమాన్యాలు ఆ విద్యార్థుల పాస్ మెమోలను కూడా మార్ఫింగ్ చేయించి ఉత్తీర్ణత సాధించినట్లుగా స్కాలర్షిప్ కోసం నమోదు చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేందుకే యాజమాన్యాలు చేస్తున్న కుట్ర ఇది అని, యాజమాన్యాలు చేసే ఈ కుట్రలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల అధికారుల అందరి ప్రమేయం ఉందని విమర్శలు ఉన్నాయి. కళాశాల యాజమాన్యాలు ఇచ్చే కమీషన్లు, విందులకు అధికారులు వాళ్లకు వారికి వంత పాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లలో క్షుణ్ణంగా విచారణ చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
అక్రమ స్కాలర్షిప్ లపై విచారణ చేస్తాం: డీడీ ఎస్సీ అభివృద్ధి శాఖ నల్లగొండ
నిబంధనలకు విరుద్ధంగా ఉపకార వేతనాలు పొందుతున్న అంశాలు నా దృష్టి కూడా వస్తున్నాయి. వీలైనంత తొందరలో వాటన్నిటిపై క్షుణ్ణంగా పరిశీలన చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ స్కాలర్షిప్ లపై విచారణ చేస్తామని అధికారి శశికళ తెలిపారు.






