GHMC: ప్లాన్‌లే ఉన్నాయి.. ప్లానర్లు లేరు! జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత

by Ramesh Naini |   (  Updated:2026-01-08 04:20:55  IST  )

నగరాలు, పట్టణాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ నిర్మాణంలో టౌన్ ప్లానర్ల దే కీలకపాత్ర. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. ఇది నిర్మాణ అనుమతులు, పట్టణాభివృద్ధి పనులను ఆలస్యం చేస్తోంది. జీహెచ్ఎంసీ వంటి నగరపాలక సంస్థల్లో సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారు అధిక భారం మోయడంతో పాటు డిప్యూటేషన్ల సమస్యలు, ఔట్‌సోర్సింగ్ నియామకాలు లేకపోవడం వంటివి ఈ కొరతకు కారణాలుగా ఉన్నాయి.

GHMC: ప్లాన్‌లే ఉన్నాయి.. ప్లానర్లు లేరు! జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరాలు, పట్టణాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ నిర్మాణంలో టౌన్ ప్లానర్ల దే కీలకపాత్ర. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. ఇది నిర్మాణ అనుమతులు, పట్టణాభివృద్ధి పనులను ఆలస్యం చేస్తోంది. జీహెచ్ఎంసీ వంటి నగరపాలక సంస్థల్లో సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారు అధిక భారం మోయడంతో పాటు డిప్యూటేషన్ల సమస్యలు, ఔట్‌సోర్సింగ్ నియామకాలు లేకపోవడం వంటివి ఈ కొరతకు కారణాలుగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయి. అయితే టౌన్ ప్లానింగ్ అధికారుల నియామకం గురించి పలుమార్లు టీజీపీఎస్సీకి లేఖ రాసినా ఫలితంలేదని అధికారులు చెబుతున్నారు.

1500 మందికి గాను..

పురపాలక, పట్టణాభివృద్ధి లోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డీటీసీపీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), రాష్ట్రంలోని 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 134 మున్సిపాలిటీల్లో టీపీఎస్ నుంచి మొదలుపెడితే డైరెక్టర్ వరకు మొత్తం 1500 మంది అవసరమని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం 400 మంది లోపే ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏలో లేఅవుట్ల పర్మిషన్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీతోపాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, మాస్టర్‌ప్లాన్ విభాగాల్లో పనిచేయడానికి 350 మంది అవసరమని అధికారులు చెబుతున్నారు. కానీ జేపీపీలతో కలిపి 150 మంది మాత్రమే ఉన్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీలో 450 మంది ఉండాల్సింది. కానీ 100 మంది లోపే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. డీటీసీపీ, 143 పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి 250 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 290 మంది కావాలని ప్రభుత్వానికి లేఖ రాస్తే 100 మందికి అనుమతిచ్చారు. ఈ 100 మందికి సైతం ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

కొరత కారణంగా..

డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సంస్థల్లో ప్రతిపాదిత సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరగడం, చిన్న పనులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతోపాటు నిర్మాణ అనుమతులు ఆలస్యం కావడంతో పాటు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, పనుల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా సిబ్బంది కొరతతో టౌన్ ప్లానింగ్ విభాగంపై విమర్శలు, చిన్నచూపు పెరుగుతోంది.

టీజీపీఎస్సీకి లేఖ రాసినా..

టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉద్యోగుల నియామకం గురించి టీజీపీఎస్సీకి ప్రభుత్వం పలుమార్లు లేఖ రాసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యను చైర్మన్ వరకు పోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల నియామకాల గురించి పరీక్షకు సంబంధించిన సిలబస్‌తోపాటు పరీక్ష నిర్వహణకు కావాల్సిన వివరాలు టీజీపీఎస్సీకి ఇచ్చిన చర్యలు తీసుకోవడంలేదనే పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

భూ భారతి చట్టం పాస్.. రూల్స్ ఫెయిల్!

Next Story