భూ భారతి చట్టం పాస్.. రూల్స్ ఫెయిల్!

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 04:20:09  IST  )

సుదీర్ఘ అధ్యయనం తర్వాత.. రాబోయే తరాలకు ఉపయోగపడేలా రాష్ట్ర సర్కారు ‘భూభారతి-ఆర్వోఆర్ 2025’ చట్టాన్ని తీసుకువచ్చింది.

భూ భారతి చట్టం పాస్.. రూల్స్ ఫెయిల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుదీర్ఘ అధ్యయనం తర్వాత.. రాబోయే తరాలకు ఉపయోగపడేలా రాష్ట్ర సర్కారు ‘భూభారతి-ఆర్వోఆర్ 2025’ చట్టాన్ని తీసుకువచ్చింది. జిల్లాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి.. వాటిని సునిశితంగా పరిశీలించి.. ఈ చట్టంలో అనేకాంశాలను చేర్చింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా అవసరమైన సరికొత్త టెక్నాలజీ వినియోగానికీ అవకాశం కల్పించింది. అయితే చట్టం వచ్చి 7 నెలలైనా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది.

భూభారతి వచ్చినా.. భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? ధరణి బాధితులు ఇంకా ఎందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు? చట్టంలో లోపాలు ఉన్నాయా? వాటిని అమలు చేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా గుర్తించక పోవడానికి కారకులు ఎవరు? అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తున్నది. భూ భారతి చట్టానికి, రూల్స్‌కి మధ్య అంతులేని తేడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఓరియెంటేషన్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చట్టం, రూల్స్‌కు మధ్య తేడా..

ప్రజామోదంతో వచ్చిన చట్టానికి, దాని అమలు కోసం రూపొందిస్తున్న రూల్స్‌కు పొంతన కుదరడం లేదు. మంచి చట్టం వల్ల 50 శాతం విజయం లభిస్తే, మిగతా 50 శాతం విజయం దాని అమలు తీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్వోఆర్-1971 చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 20 ఏండ్లు పట్టింది. గైడ్‌లైన్స్ రిలీజ్ చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఆ తర్వాత కూడా ఎన్నో క్లారిఫికేషన్లు, మరెన్నో సర్క్యులర్లు జారీ చేశారు. అయితే భూ భారతి చట్టం రూపకల్పన, రూల్స్ తయారీ మధ్య తీవ్ర అంతరం కనిపిస్తున్నది.

చట్టాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశాలను తొక్కి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. భూముల విలువను బట్టి కింది స్థాయి అధికారులకే కట్టబెట్టాలన్న నిబంధనను వారికి అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఎకరం భూమి ధర రూ.20 లక్షలు ఉంటే.. అందులో ఓ గుంట విలువ రూ.50 వేలే అవుతుంది. కానీ ఎకరం రేటునే ప్రామాణికంగా తీసుకొని ఉన్నతాధికారులకే పంపాలన్న నిబంధనలతో కలెక్టర్, సీసీఎల్ఏ వరకు ఫైళ్లు పంపిస్తున్నారు. ఇలాంటి అనేక గైడ్ లైన్స్ ఉన్నతాధికారులకు అనుకూలంగా రాసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ధరణితో తీవ్ర గందరగోళం..

ఉమ్మడి రాష్ట్రంలో 1971లో తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టం ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. అయితే 2020లో తీసుకొచ్చిన ధరణి చట్టం 5 నెలల్లోనే గందరగోళం సృష్టించింది. రికార్డుల ప్రక్షాళనలో హడావుడితో లక్షలాది ఎకరాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. కిందిస్థాయి సిబ్బంది, చివరికి కలెక్టర్లను సైతం నిమిత్తమాత్రులను చేసి.. అధికారాలన్నీ కేంద్రీకృతం చేశారు. ప్రతి చిన్న పనినీ సీసీఎల్ఏకు అప్పగించారు. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో కొందరు అధికారుల ఇష్టారాజ్యం కొనసాగింది. ఇది కొందరికి ఆదాయాన్ని సమకూర్చింది. ఆఖరికి జిల్లా కలెక్టర్లపైనా అవినీతి మరక అంటింది. అదనపు కలెక్టర్లు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి రికార్డులు బ్రేక్ చేశారు. అందుకే అవినీతి స్థాయిని తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన ఆడిట్ వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

సాదాబైనామాలకు ఆచరణ సాధ్యం కాని నిబంధనలు..

ధరణి ద్వారా పెండింగులో ఉన్న 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తులను క్లియర్ చేసేందుకు భూ భారతి చట్టం దోహదపడుతుంది. కోర్టు స్టే ఎత్తివేయడానికి ఇదే తోడ్పడింది. కనీసం నాలుగు లక్షల దరఖాస్తులైనా జెన్యూన్‌గా ఉండొచ్చు. కానీ అమ్మినోళ్లు అఫిడవిట్ సమర్పించాలన్న గైడ్‌లైన్స్‌తో ఒక్క శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. పైగా అమ్మిన వ్యక్తి రికార్డుల్లో ఉంటేనే పరిష్కారం. ఆయన చనిపోయి వారసుల పేరిట భూములు ఉంటే రిజెక్ట్. ఫీల్డ్ ఎంక్వయిరీ, ఫిజికల్ పొషెషన్‌తో పరిష్కరించాల్సిన వాటిని ఐఏఎస్ అధికారులు మరింత జఠిలం చేశారు. సాఫ్ట్ వేర్/రూల్స్‌లో క్లారిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో కోర్టులో స్టే వెకెట్ చేయించిన విజయంతో పాటే ప్రభుత్వానికి అపకీర్తిని తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ పేరుతో రిజెక్ట్..

ఎంతో మంది రైతులు తమ సర్వే నెంబర్ మిస్ అయిందని, విస్తీర్ణం తక్కువగా వచ్చిందని ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి అప్లికేషన్లను ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ రిజెక్ట్ చేస్తున్నారు. పాత రికార్డులను పరిశీలించి, ఇల్లీగల్‌గా కొనసాగుతున్న వారిని తొలగిస్తే పరిష్కారం లభిస్తుంది. కానీ అదనపు విస్తీర్ణం ఎవరి పేరిట ఉందో వారిని తొలగించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఎవరైనా గుర్తించినా.. నోటీసులతో సరి పెడుతున్నారు. కాలయాపనతో ఏండ్లు గడుస్తున్నాయి. దాంతో భూమి లేనోళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నిజమైన అర్హులు హక్కులతో పాటు సంక్షేమ పథకాలు మిస్ అవుతున్నారు. దీనికి గైడ్ లైన్స్ ఇచ్చేందుకు భూ భారతి తో సంబంధమే లేదు. కానీ కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

Read More..

జనగణనలో కీలక అడుగు.. ఏప్రిల్ ​నుంచి హౌస్​లిస్టింగ్

Next Story