- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ బీజేపీకి దిక్కెవరు? నేటికి కనిపించని అభ్యర్థులు!
అది జాతీయ పార్టీ. వరుసగా మూడుసార్లు తిరుగులేని ఆధిఖ్యంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ.

దిశ, నల్లగొండ బ్యూరో : అది జాతీయ పార్టీ. వరుసగా మూడుసార్లు తిరుగులేని ఆధిఖ్యంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ. కానీ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న పార్టీ కట్టర్ కార్యకర్తలు, సిట్టింగ్ కౌన్సిలర్లకు మాత్రం టికెట్లు ఇచ్చేందుకు విముఖత చూపుతుండటం గమనార్హం. ఇది ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎక్కడో కాదండి నల్లగొండ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో పరిస్థితి. అసలు నల్లగొండ బీజేపీలో ఏం జరుగుతోంది..? వర్గపోరు నడిపిస్తున్నది ఎవరు? లక్ష్మణ్ ఎంట్రీతోనైనా సమస్యలు సర్థుమణుగుతాయా..?
జాతీయ పార్టీకి అభ్యర్థుల కరువు...
కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి కార్పొరేషన్‌లో ఉన్న 48 వార్డులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారనే టాక్ వినిపిస్తుంది. అందువల్లే ఇప్పటివరకు కూడా పార్టీ నుంచి అధికారికంగా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదని తెలుస్తోంది. అంతే కాదు.. రాష్ట్ర, జాతీయ నాయకులుగా నల్లగొండ టౌన్‌లో చలామణి అవుతున్న కొంతమంది నాయకుల డివిజన్లో ఇంతవరకు అభ్యర్థులను కూడా గుర్తించలేకపోయారని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆసక్తి చూపుతున్న అభ్యర్థులను జిల్లా నాయకత్వం నిరుత్సహపరుస్తున్నట్లు తెలుస్తుంది.
సిట్టింగులకు నో ఛాన్స్
గత మున్సిపల్ కౌన్సిల్‌లో ఆరుగురు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో బొజ్జ మల్లిక, బండారు ప్రసాద్, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశ్వర్లు, దాసరి సాయి, పట్టణ అధ్యక్షుడు నాగిరెడ్డి మాతృమూర్తి ఉన్నారు. వీళ్లందరికీ ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా జిల్లా నాయకత్వం నిరాకరించినట్లు సమాచారం. అయితే సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్ ఇవ్వకుండా కొత్త వాళ్లని ప్రోత్సహించి డివిజన్లలో గందర గోళం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. నేటితో నామినేషన్లు దాఖలు పూర్తవుతున్నా ఇంతవరకు మేయర్ అభ్యర్థిని గుర్తించపోవడం గమనార్హం. అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారనే అవగాహన కూడా నేతల్లో లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా కనిపిస్తుంది.
వర్గ పోరుకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ
పట్టణ బీజేపీలో వర్గపోరు మూడు పూవ్వులు, ఆరుకాయలుగా ఉంది. దీనికి ప్రధాన కారణం సీనియర్ నేతలనే చెప్పొచ్చు. దాదాపు 30, 40 ఏళ్లకు పైగా పార్టీలో పనిచేస్తున్న నాయకులు జూనియర్ల మధ్య సఖ్యత కుదిరించాల్సింది పోయి తగాదాలకు ఆజ్యం పోస్తున్నట్లు పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని మరింత రచ్చకెక్కించి రాష్ట్ర నాయకత్వం చేత రామరాజు మీద చర్యలు తీసుకోవాలని షోకాజ్ నోటీస్ పంపించినట్టు తెలిసింది. ఇది జరిగి సుమారు 20 రోజులు అవుతుంది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు కొంతమంది నాయకులు అంతర్గతంగా ఉంచాల్సిన షోకాస్ నోటీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
జాతీయ నేత రాకతోనైనా మారేనా..?
భారతీయ జనతా పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు నల్లగొండ రానున్నారు. ఆయన రాకతోనైనా నల్లగొండ బీజేపీలో ఉన్న వర్గపోరు కట్టడి అయ్యి కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం వీడేనా, లేదా అనేది వేచి చూడాలి.






