- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు 5,774.. లెక్క తేల్చిన అధికారులు
రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. ఈనెల 12తో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తయింది. దీంతో స్థానాలపై స్పష్టత వచ్చింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం కావడం, ఓఆర్ఆర్‌లోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడమే ఇందుకు కారణం.
ఒక మండలంలో ఐదు స్థానాలు..
కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండే విధంగా మార్పులు చేసింది. వాస్తవానికి ఒక ఎంపీటీసీ స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపీపీ, వైస్ఎంపీపీలకు ఇద్దరు ఎంపీటీసీ కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరుకావడానికి కనీసం మరో ఎంపీటీసీ అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో ఐదు ఎంపీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి.
విలీనమే సంఖ్య తగ్గడానికి కారణం
రాష్ట్రంలో గత మార్చి తర్వాత కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్కార్పొరేషన్లు ఏర్పడటంతో సమీప గ్రామాలను అందులో కలిపారు. ఓఆర్ఆర్ లోపలి గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీ స్థానాలు సంఖ్య తగ్గింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆ జిల్లాను అర్బన్‌జిల్లా మార్చారు. దీంతో ఆ 19 స్థానాలు కనుమరుగైపోయాయి. ఖమ్మం, నారాయణపేట్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు చొప్పున, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలు పట్టణ స్థానిక సంస్థల్లో వీలినమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఇప్పటికే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలపై స్పష్టత
ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల లెక్క తేలింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి దశ కసరత్తు దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వగానే వాటిని పంచాయతీరాజ్‌శాఖ ఖరారు చేయనుంది. అనంతరం ఆ వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. దీంతో ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత ఎన్నికలకు కమిషన్ ఏర్పాటు చేయనుంది.
జిల్లా - ఎంపీటీసీ స్థానాలు
-------------------------------------------------
ఆదిలాబాద్ - 166
అసిఫాబాద్ - 127
మంచిర్యాల - 129
నిర్మల్ - 157
కరీంనగర్ - 170
జగిత్యాల - 216
సిరిసిల్ల -123
పెద్దపల్లి -139
నిజామాబాద్ - 307
కామారెడ్డి - 237
సిద్దిపేట - 230
సంగారెడ్డి - 273
మెదక్ - 190
రంగారెడ్డి - 231
వికారాబాద్ - 227
మహబూబ్‌నగర్ - 175
నారాయణపేట్ - 132
నాగర్‌కర్నూలు - 210
గద్వాల - 142
వనపర్తి - 133
సూర్యాపేట - 235
నల్లగొండ - 352
భువనగిరి - 178
వరంగల్ - 130
హన్మకొండ- 129
ములుగు - 84
మహబూబాబాద్ -193
భూపాలపల్లి - 109
జనగామ - 134
ఖమ్మం - 288
కొత్తగూడెం - 232
------------------------------
మొత్తం - 5,744
------------------------------






