మరికొద్ది సేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం

by Malleboina Mahesh |

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

మరికొద్ది సేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సభ ప్రారంభం అయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలపనున్నారు. తుంగుతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్​రెడ్డి, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్​ ఎన్నిక షెడ్యూల్‌ను సభలో ప్రకటిస్తారు.

సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సోమవారం వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మూడు రోజుల పాటు సభకు జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. దీనికి కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

బీఆర్ఎస్‌పై ఎదురుదాడి..

అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిలు పలు సూచనలు చేశారు. సెలవు రోజుల్లోనూ నీటిపారుదల శాఖ అధికారులు పవర్​పాయింట్​ప్రజెంటేషన్, నదీ జిలాలకు సంబంధించిన ఆధారాలు, సంతకాలు చేసిన డాక్యుమెంట్‌లను కలెక్ట్ చేసి తేదీల వారీగా పొందు పర్చే పనిలో నిమగ్నమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలపై కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన వీడియా ఫుటేజ్ సైతం సేకరించినట్లుగా సమాచారం. అసెంబ్లీలో, బయట ఆయన మాట్లాడిన క్లిప్పులను సేకరించారు.

వీటినే ఆస్త్రాలుగా చేసుకొని బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయాలని అధికార పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో పర్యటించినప్పుడు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన క్లిప్పులను సైతం ఆధారంగా చూపించి ఎదురుదాడి చేయనున్నారని సమాచారం. ఇందుకోసం జనవరి 1న కాంగ్రెస్​శాసనసభ్యులకు, మండలి సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షం చేసిన తప్పులను ప్రజలకు వివరించనున్నారు.

అసెంబ్లీకి కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

అసెంబ్లీ మొదటి రోజున ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. గత బడ్జెట్​ సమావేశాల టైంలో ఆయన ఒక రోజు సభకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా అసెంబ్లీకి రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో సభ ఆసక్తిగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్​ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ను ఏఐసీసీ ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయన్ను బలపరుస్తూ నామినేషన్​వేయనున్నారు. సభలో ఉన్న మెజార్టీ దృష్ట్యా ఆయన ఎన్నిక ఏక్రగీవం కానుంది. లంబాడ సామాజిక వర్గానికి గుర్తింపు ఇవ్వాలనే కాంగ్రెస్​ పార్టీ రామచంద్రునాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసిందని సమాచారం. ఎస్టీల్లో ఆదివాసీ వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్​కుమార్​అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు.

ధర్నాలు, ఆందోళనలు జరగకుండా బందోబస్తు

శాసనసభ, మండలి సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మండలి కార్యదర్శి వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీపీ విజయకుమార్‌లు హాజరయ్యారు. సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. సమావేశాలు సజావుగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు.

సభ జరుగుతున్న టైంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు. అవసరమైన నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. సెషన్స్‌కు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అధికారులు తెలిపారు.

సభ ముందుకు పలు బిల్లులు..

జీఎస్టీ చట్ట సవరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్​స్థానంలో బిల్లును అసెంబ్లీ ముందు ఉంచనున్నారు. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను జీహెచ్ఎంసీలో విలీనానికి సంబంధించిన పలు ఆర్డినెన్స్‌లను సభ ముందు ఉంచుతారు. గ్రేటర్​హైదరాబాద్​చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణలను సభ ముందు పెట్టనున్నారు. వీటితో పాటే పంచాయతీరాజ్​చట్టంలో ఇద్దరు పిల్లలకు సంబంధించిన సవరణ, పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లను సభ ముందు ఉంచుతారు. పలు శాఖలు, కార్పొరేషన్ల వార్షిక నివేదికలను సైతం సభ ముందుకు తీసుకురానున్నారు.

మాజీ సీఎంను మేమెందుకు అవమానిస్తాం : మంత్రి శ్రీధర్‌బాబు

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు సభ్యులందరూ హాజరు కావాలని కోరుకుంటామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరగాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్​ సభకు వచ్చి వారికున్న ఆలోచనలు, అనుభవాలను చెప్పాలన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడేలా చూడాలన్నారు. కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తిని తాము ఎందుకు అవమానిస్తామని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్​అనుభవం ద్వారా ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తమకు బేషజాలు లేవని సీఎం రేవంత్​అనేక సార్లు చెప్పారన్నారు. రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధి, పురోగతికి ఎవరు సూచనలు, సలహాలు ఇచ్చినా తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా సభలో దేనిపైన చర్చ జరిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, సమావేశాల ఎజెండా బీఏసీలో ఖరారు అవుతుందన్నారు.

Next Story