మారని ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల తీరు.. కాలేజీ ఓ చోట, అటెండెన్స్ మరోచోట

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగం అక్రమాలకు నిలయంగా మారుతోంది.

మారని ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల తీరు.. కాలేజీ ఓ చోట, అటెండెన్స్ మరోచోట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగం అక్రమాలకు నిలయంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్-2047 దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నకిలీ అధ్యాపకుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి బోధనా సిబ్బంది ఉండాలి. కానీ, కాగితాల్లో చూపించేందుకు యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కనీస నైపుణ్యాలు ఉండడం లేదు. ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చాలాసార్లు హెచ్చరించినా కాలేజీ యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారమే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటున్నామని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని కొన్ని ప్రయివేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

వేలిముద్రలు క్లోన్ చేసి అటెండెన్స్

కొందరు అధ్యాపకులు ఒకచోట పని చేస్తూ, మరో చోట అటెండెన్స్ వేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం తనిఖీల సమయంలోనూ, బయోమెట్రిక్ హాజరు కోసం మాత్రమే కాలేజీ గడప తొక్కుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల అధ్యాపకుల ప్రమేయం లేకుండానే, వారి వేలిముద్రల క్లోన్‌లను ఉపయోగించి బయోమెట్రిక్ యంత్రాల్లో హాజరు నమోదు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని హయత్ నగర్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉండే ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అధ్యాపకులు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక డిగ్రీ కాలేజీలో ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను మేనేజ్ చేస్తూ తప్పుడు హాజరు నమోదు చేస్తున్నారని సీజేఎస్ సంస్థ నుంచి ఇటీవల ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు అందాయి. కానీ ఆ ఫిర్యాదు గురించి బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.

యాజమాన్యాల కక్కుర్తి

కళాశాల గుర్తింపు పొందడానికి తగినంత మంది పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు ఉండాలి. అయితే, భారీ జీతాలు చెల్లించలేక యాజమాన్యాలు ఇలాంటి నకిలీ పద్ధతులకు తెరలేపుతున్నాయి. చాలామంది అధ్యాపకులు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ వేసి వెళ్తున్నారు. జేఎన్టీయూ పరిధిలో 140 ఇంజినీరింగ్ కాలేజీలుంటే, సుమారు 50 శాతం కాలేజీల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ పూర్తి చేసిన వారిని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించాలి. అందుకు విరుద్ధంగా బీటెక్ పూర్తిచేసిన వారితో ఇంజినీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల పాస్ పర్సంటేజీపై పడుతోంది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి.

ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతున్న ఉన్నత విద్యా మండలి

ఈ అక్రమాలపై ఇటీవల సీజేఎస్ సంస్థ నుంచి ఉన్నత విద్యా మండలి అధికారులకు వరుస ఫిర్యాదులు అందినప్పటికీ, వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోవడం వెనుక బలమైన శక్తుల ఒత్తిడి ఉందనే అనుమానాలు నెలకొన్నాయి. ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినా ఉన్నత విద్యా మండలి అధికారులు రహస్యంగా ఉంచుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడంతో, పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. పీహెచ్‌డీ లేకపోయినా, ఎంటెక్ విద్యార్హతతో కొన్ని కాలేజీలు ప్రిన్సిపాళ్లను సైతం నియమించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి, నకిలీ అధ్యాపకులను ప్రోత్సహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Next Story