- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందస్తు ప్రకటనలతో వచ్చిన తిప్పలు.. అర్కాల రియల్టీ సంస్థపై TG-RERA కొరడా!
తెలంగాణలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన అర్కాల రియల్టీ ఇన్ఫ్రా సంస్థకు టీజీరెరా భారీ జరిమానా విధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) వద్ద ప్రాజెక్టును రిజిస్టర్ చేయించకుండానే, ముందస్తు ప్రకటనలు ఇస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన అర్కాల రియల్టీ ఇన్ఫ్రా సంస్థకు రెరా అథారిటీ రూ.22,41,525 భారీ జరిమానా విధించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, డె వలప్‌మెంట్ చట్టం 2016 ప్రకారం, 500 చదరపు మీటర్లు, ఎనిమిది యూనిట్లకు మించిన ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయినా, అవసరమైన అన్ని అనుమతులను పొందిన తర్వాత తెలంగాణ రెరా వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్ పొందక ముందు ఏవిధంగా అయినా ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, బుకింగ్‌లు స్వీకరించడం, అమ్మకం చేయడం లేదా అమ్మకానికి ఆఫర్ చేయడం, డబ్బులు స్వీకరించడం, లేదా ప్లాట్/అపార్ట్‌మెంట్/ భవనం కొనుగోలు చేయమని వ్యక్తులను ఆహ్వానించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
తుక్కుగూడలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్-14 వద్ద ఓ కొత్త ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, అందులోని సదుపాయాలను చూపిస్తూ అర్కాల రియల్టీ ఇన్ఫ్రా సంస్థ చట్టవిరుద్ధమైన ప్రకటనలు ఇచ్చిందని రెరా దృష్టికి రావడంతో సుమోటో నోటీసులు జారీ చేసింది. సంస్థ వాదనలు విన్న అథారిటీ తదుపరి విచారణ అనంతరం ఆ సోషల్ మీడియా ప్రకటనలు చట్టంలోని సెక్షన్ 3 ఉల్లంఘన కిందకే వస్తాయని పేర్కొన్నది. రెరా రిజిస్టర్ లేకుండా ప్రకటనలు ఇచ్చి, ఆసక్తి గల కొనుగోలుదారులు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొనడం పూర్తిగా చట్టవిరుద్ధమని తెలిపింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు గాను, సెక్షన్-59 ప్రకారం అర్కాల రియాల్టీ ఇన్ఫ్రా సంస్థకు రూ.22,41,525 జరిమానా విధించింది. రెరాలో ప్రాజెక్టు రిజిస్టర్ చేసుకునేంత వరకు తదుపరి ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఆ ప్రకటనలు నమ్మొద్దు..
రెరా రిజిస్ట్రేషన్ నంబర్ లేని ప్రకటనలు నమ్మొద్దని, అలాంటి ప్రకటనలు కనిపిస్తే 040-29394972 నంబర్‌కు కాల్ చేయాలని, వాట్సాప్ ద్వారా 9000006301, ఈ-మెయిల్([email protected]) ద్వారా రెరా దృష్టికి తీసుకురావాలని ఇల్లు/ప్లాట్ కొనుగోలుదారులకు రెరా అథారిటీ సూచనలు చేసింది. అదే విధంగా, ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబరు పొందుపరుస్తే, ఆ నంబరు ద్వారా రెరా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్ వివరాలు, ప్లాన్ అనుమతులు, లేఅవుట్ ప్రణాళికలు, డబ్బు చెల్లించబోయే సంబంధిత ప్రాజెక్టు బ్యాంకు ఖాతా, ప్రాజెక్ట్ పూర్తి కాబోవు తేదీ మరియు ప్రమోటర్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని, పూర్తి బాధ్యతతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. మరో వైపు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది.






