సర్పంచ్ ఎన్నికలతో వచ్చిన తిప్పలు.. అభ్యర్థుల కాల్స్‌తో ఎమ్మెల్యేలు సతమతం

by Kema Shiva Kumar |

సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారు.

సర్పంచ్ ఎన్నికలతో వచ్చిన తిప్పలు.. అభ్యర్థుల కాల్స్‌తో ఎమ్మెల్యేలు సతమతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారు. గత రెండ్రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరఫున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు, సూచనలు అడిగితే పర్లేదు. కానీ, ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనితో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో ఒకట్రెండు గ్రామాలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకుని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి. అందుకని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు.

రూ.5 లక్షలు నుంచి రూ.కోటిన్నర..

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్‌తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరి పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధమవగా, మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్ఠంగా రూ.2 వేల వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థికసాయం అడుగుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఒత్తిడి

అధికార పార్టీ సపోర్టుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని, ఎంతో కొంత సాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు.‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏం ఇవ్వలేదు. ఇప్పుడైన ఎంతో కొంత ఇవ్వండి.”అని పదే పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు. ఒకట్రెండు గ్రామాలకు నిధులు పంపితే సరిపోదు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి డబ్బులు ఇవ్వాలని డిమాండ్లు వస్తాయి. అందుకని ఫోన్ చేసిన వ్యక్తులకు ఏం సమాధానం ఇవ్వడం లేదని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వివరించారు.“ఒకరికి ఇస్తే సరిపోతుందా? అందరికీ ఇవ్వాలి. అందుకని ఎవరికీ ఇవ్వకుండా ఉండటం బెటర్’’ అని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి తన వ్యూహాన్ని వెల్లడించారు.

సన్నిహితులకు మాత్రం మద్దతు

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సన్నిహితులు లేకపోతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులను గుర్తించి ఆర్థిక సాయం అందించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. నేరుగా డబ్బులు ఇవ్వకుండా స్థానికంగా ఉండే వ్యాపారులు, బంధువుల ద్వారా ఆ డబ్బులను పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని ఇతర గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా జాగ్రత్త పడాలని ఒకటికి రెండు సార్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికి ఆర్థిక సాయం చేయనంటూ స్పష్టం చేస్తున్నారు. ‘నేను ఎవరికి ఒక్క పైసా ఇవ్వను. మీరే సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి. గెలిచిన వాళ్లకే నా సపోర్టు’ అని నిర్మోహమాటంగా చెబుతున్నారు.

చేతులెత్తేస్తున్న BRS, BJP ఎమ్మెల్యేలు

గులాబీ, కమలం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల వద్ద ఉన్నట్లు తమ వద్ద నిధులు లేవని స్పష్టం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు సమానంగా ఖర్చు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అనవసరంగా సొంత డబ్బులను ఖర్చు చేసి నష్టపోవద్దని సూచిస్తున్నారు. అయినా కొన్ని గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు గెలుపుకోసం కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Next Story