పీక్స్‌కు చేరిన ప్రలోభాలు.. నిఘా నీడకు చిక్కకుండా పార్టీల నయా స్కెచ్!

by Sathputhe Rajesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలే కౌంట్ డౌన్ మిగిలి ఉండటంతో పార్టీల మధ్య ప్రలోభాల పర్వం పీక్స్‌కు చేరుకుంది.

పీక్స్‌కు చేరిన ప్రలోభాలు.. నిఘా నీడకు చిక్కకుండా పార్టీల నయా స్కెచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో/ వరంగల్ / వర్ధన్నపేట/ జహీరాబాద్/ ఖానాపూర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలే కౌంట్ డౌన్ మిగిలి ఉండటంతో పార్టీల మధ్య ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకుంది. ఏ అభ్యర్థి గెలిచినా తక్కువ మెజార్టీతో బయటపడతానే అంచనాలు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా పంపకాల జోరు కొనసాగిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ఊహించని రీతిలో ఓటర్లకు తాయిలాలు ముట్టజెప్పుతున్నారు.

నగదు, మద్యం, మహిళలకు చీరలు, బంగారం, గృహోపకరణాలను పంచుతూ తమకే ఓటు పడేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క ఓటును జారవిడుచుకోవద్దన ఉద్దేశంతో ఓటును కొనుగోలు చేసేందుకు ఎంత డబ్బు అయినా పంచడానికి రెడీ అవుతున్నారు. కుల సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లవారీగా అభ్యర్థు అనుచరులు ఇప్పటికే పంచుడు షురూ చెయగా ఎన్నికల సంఘం నిఘా నేపథ్యంలో తమకు నమ్మకస్తుల ద్వారా ఈ తంతు పూర్తి చేయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రలోభాల కోసం తరలిస్తున్న నగదు, మద్యాన్ని అధికారులు భారీగా పట్టుకుంటుంటున్నారు.

బీఆర్ఎస్ నేతల ఇంట్లో భారీగా నగదు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బొక్కలగూడెం గ్రామంలో బీఆర్ఎస్ నేత ఇంట్లో 7.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఖాసీంపూర్ లో డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. మరోవైపు హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లలో తరలిస్తున్న రూ.కోటి 68 లక్షల 80వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థికి అనుమానిస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం ఎక్స్ రోడ్ చెక్ పోస్టు వద్ద 8 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం తరలిస్తున్న డీసీఎంను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిఘాకు దొరకకుండా..

ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో అభ్యర్థులు స్మార్ట్ గా వ్యవహరిస్తున్నారు. నేరుగా పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా నగదు పంపిణీ చేస్తే దొరికిపోతామని ఇతర మార్గాల ద్వారా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చిరు వ్యాపారుల ద్వారా ఓటర్లకు చేరవేయాల్సిన నగదు ముట్టజెప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చోట్ల నేరుగా నగదు ఇవ్వకుండా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు.

నగదు తరలిస్తూ దొరికిపోతే అది ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్న అభ్యర్థులు సాధ్యమైనంత వరకు స్థానిక నేతల ద్వారానే సర్దుబాటు చేయాలని ఎన్నికల తర్వాత సెటిల్ మెంట్ చేస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు. కొంత మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రయాణ ఖర్చులు అందజేయగా మరికొన్ని చోట్ల గ్రామానికి వచ్చి ఓటు వేశాక డబ్బు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పార్టీకో రేటు..

అభ్యర్థులు, పోటీ తీవ్రతను బట్టి ఓటుకు రేటు పలుకుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి రూ.6 నుంచి 10 వేల వరకు ఇచ్చుకునేందుకు అభ్యర్థులు వెనుకడుగు వేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. త్రిముఖ పోరు ఉన్న చోట్ల అభ్యర్థులు కాంప్రమైజ్ లేకుండా ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక గెలుపుపై నమ్మకం ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ విషయంలో ధైర్యం చేస్తుంటే అపనమ్మకమున్న అభ్యర్థులు మాత్రం కాస్త ఆచితూచి పంపకాలు కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ఎన్నికలు బహిష్కరించిన నాలుగు గ్రామాల ప్రజలు..

నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగ్లపూర్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న మరో మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ మేరకు ఇవాళ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అడవి ప్రాంతంలో జీవిస్తున్న తమకు కనీస మౌళిక సదుపాయులు లేవని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు వాగ్దాలు చేస్తూ తమ చేత ఓట్లు వేయించుకుంటున్నారని, ఆ తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్ల ఈసారి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Next Story