కేంద్రం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.. కోదండరెడ్డి డిమాండ్

by Gantepaka Srikanth |

వరి జన్యు మార్పిడి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అనుమతి ఇవ్వడం సరికాదని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.

కేంద్రం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.. కోదండరెడ్డి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి జన్యు మార్పిడి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అనుమతి ఇవ్వడం సరికాదని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళవారం ఈవిషయంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి లేఖ రాశారు. వరి జన్యు మార్పిడి విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అత్యంత తీవ్రమైందని దీంతో దేశంలో ఉన్న ఆహార విధానాలపై ప్రభావం చూపుతుందన్నారు. యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వంకాయ జన్య మార్పిడిని కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. రాష్ట్ర రైతాంగం అభిప్రాయాన్ని మన్నించి ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

మోడీ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వరి ధాన్యాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేది తెలంగాణ అని ఇక్కడి రాష్ట్ర రైతాంగం తరుపున రైతు కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎక్కువశాతం వరి పండించే తెలంగాణపై ఈ నిర్ణయంతో తీవ్రమైన ఆర్థిక ప్రభావం పడుతుందని, అంతేకాదు విత్తన హక్కుకు కూడా భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర అభిప్రాయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వినియోగదారులను పరిగణలోకి తీసుకోకపోవడం తీవ్రమైన విషయంగా కమిషన్ పరిగణిస్తుందన్నారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యవసాయం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు.

Next Story