ప్రమాదంలో ప్రభుత్వ వైద్య కళాశాలల మనుగడ!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-16 02:33:41  IST  )

రాష్ట్రంలోని సుమారు 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రమాదంలో ప్రభుత్వ వైద్య కళాశాలల మనుగడ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సుమారు 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో ఆయా కళాశాలల్లో చేపట్టిన తనిఖీల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ హెల్త్ సెక్రెటరీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ను ఎన్ఎంసీ ఆదేశించింది. ఆయా కళాశాలల బాధ్యులు సైతం వర్చువల్‌గా హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 13న వీరికి లేఖ పంపింది. అయితే ఇప్పుడు అధికారులు ఇచ్చే వివరణపైనే మెడికల్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉండనుంది. లేకుంటే వైద్య విద్య సీట్లలో కోత పడే ప్రమాదముందనే చర్చ జరుగుతున్నది. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల మనుగడ కూడా ప్రమాదంలో పడవచ్చనే చర్చ జరుగుతున్నది.

లేఖలో పేర్కొన్న వైద్య కళాశాలలు ఇవే..

ఎన్ఎంసీ పంపిన లేఖలో పలు జిల్లాల్లో కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు వైద్య విద్యకే కేంద్రమైన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉన్న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) పేరు ఉండడం ఆందోళనకు గురి చేస్తున్నది. గతంలో ఇక్కడ చదివిన విద్యార్థులు.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించి సౌకర్యాలు కల్పిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ లిస్టులో ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,జగిత్యాల, వనపర్తి లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి.

ఎందుకీ పరిస్థితి?

ప్రభుత్వ వైద్యకళాశాలల్లో నిబంధనల మేరకు ఫెసిలిటీస్ లేవని ఎన్ఎంసీ తన లేఖలో పేర్కొంది. అధ్యాపకుల ఆధార్ కు అనుసంధానం చేసే బయోమెట్రిక్ ఆధారిత హాజరుతోపాటు.. వైద్య విద్య స్థాయికి అనుగుణంగా సౌకర్యాలు లేవని చెప్పినట్లు సమాచారం. సరైన టీచింగ్ ఫ్యాకల్టీ, వైద్య విద్యకు సంబంధించిన పూర్తిస్థాయి వసతులు కూడా లేవని లేఖలో ఎత్తిచూపినట్లు తెలిసింది. ప్రాక్టికల్స్ కోసం ల్యాబ్ ఫెసిలిటీ, మృతదేహాల వరకు స్టాండర్డ్స్ ను అందుకోలేకపోతున్నాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో 2025-26 సంవత్సరానికి సంబంధించి మెడికల్ సీట్లపై నేరుగా ప్రభావం పడే ప్రమాదముంది.

గత ప్రభుత్వ హయాంలో హడావిడిగా అనుమతులు..

ప్రపంచ ఆరోగ్యసంస్థ నియామవళి ప్రకారం.. జనాభాకు అనుగుణంగా ఉండాల్సిన వైద్యుల సంఖ్య గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు గణనీయంగా పెరిగింది. వర్ధమాన దేశాల్లో మన కంటే కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రతీ వెయ్యి మంది జనాభాకు 1.35 రేష్యూతో తెలంగాణ కాస్త మెరుగ్గానే ఉన్నది. అయితే మిగతా రంగాలతో పోలిస్తే వైద్యరంగం పూర్తిగా భిన్నమైంది. క్వాలిటీ విద్య విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. అయితే సరైన సౌకర్యాలు లేకున్నా.. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ఎంసీ నుంచి హడావిడిగా అనుమతులు తెచ్చుకున్నది. తాత్కాలికంగా నెట్టుకొచ్చేలా కొన్ని కాలేజీలను గోడౌన్లలో సైతం ప్రారంభించిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై వైద్య రంగానికి చెందిన నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరించినా.. నాటి పాలకులు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి అవే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకేసారి ప్రారంభించడంతో..

ఒకే సారి ఎక్కువ సంఖ్యలో వైద్య కళాశాలలు ప్రారంభించడంతో పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించడం సాధ్యం కాలేదని ప్రస్తుతమున్న ఫ్యాకల్టీలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సౌకర్యాలు లేకపోవడంతో స్టూడెంట్స్ సు సైతం న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఇంకా వైద్య కళాశాలల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపిస్తున్నారు. దీంతో స్టూడెంట్స్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మరోవైపు జాతీయ వైద్యమండలి బయోమెట్రిక్ నిబంధన ఫ్యాకల్టీల ప్రైవసీకి భంగం వాటిల్లేలా ఉందని పేర్కొంటున్నారు. తాము ఎక్కడ ఉన్నామో సూచించే ట్రాకర్ లా ఇది పని చేస్తున్నదని చెబుతున్నారు. ప్రమోషన్లు, ఇన్సెంటీవ్స్ విషయంలో చొరవ చూపని ప్రభుత్వం.. ఇలాంటి నియమాల విషయంలో మాత్రం వడివడిగా అడుగులు వేయడం సరికాదని పేర్కొంటున్నారు.

ఉన్నతాధికారుల సమాధానంపైనే..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ వైద్య కళాశాలల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థులు చేరి చదువు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఎన్ఎంసీ.. రాష్ట్ర అధికారులను విచారణకు పిలవడంతో ఆందోళన నెలకొంది. కాలేజీలు వచ్చింది గత ప్రభుత్వంలో కాబట్టి.. అప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా వారినే కారణంగా పేర్కొని.. పూర్తిస్థాయి సౌకర్యాల కోసం మరింత సమయం కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారనే దానిపైనే మెడికల్ సీట్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఒక వేళ అధికారులు ఇచ్చే వివరణకు కమిషన్ ఒప్పుకొని సమయం ఇస్తే మంచిదే. లేకుంటే పెద్ద ఎత్తున సీట్లు కోల్పోవాల్సి వస్తుందని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story