అధికారం పోయినా ఆగని ఆధిపత్య పోరు.. అధిష్టానం కూడా లైట్ తీసుకుందా?

by Gantepaka Srikanth |

ఇప్పటికే అధికారం కోల్పోయి సతమతం అవుతున్న బీఆర్ఎస్‌కు జిల్లాలు, నియోజకవర్గాల్లో రోజు రోజుకూ పెరిగి పోతోన్న ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు కునుకు లేకుండా చేస్తున్నాయి.

అధికారం పోయినా ఆగని ఆధిపత్య పోరు.. అధిష్టానం కూడా లైట్ తీసుకుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే అధికారం కోల్పోయి సతమతం అవుతున్న బీఆర్ఎస్‌కు జిల్లాలు, నియోజకవర్గాల్లో రోజు రోజుకూ పెరిగి పోతోన్న ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో నేతల మధ్య ఉన్న కలహాలు బయట పడుతున్నాయి. ఇవన్నీ అధిష్ఠానం దృష్టికి వచ్చినా ‘సమయం వచ్చినప్పుడు వారే సర్దుకుంటారు. ఇప్పటి నుంచే ఎందుకు బుజ్జగించడం, సర్దిచెప్పడం’ అనే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది.

- మానుకోటలో మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్‌, మాజీ ఎంపీ మాలోతు కవితల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవలే జరిగిన సమావేశంలో శంకర్​నాయక్, కవిత మధ్య ఆరోపణల పర్వం పార్టీ కేడర్‌ను ఆందోళనకు గురిచేసింది. ‘ఇక్కడ వేయి కూర్చీలు ఉండాలి? ఎవరు తీసుకుపోయారు? మాజీ ఎంపీ కవిత ఇంటికి తీసుకుపోయారా?.. పార్టీ ఆఫీస్ నిర్మాణానికి అధిష్ఠానం ఇచ్చిన రూ.50 లక్షలు ఏమయ్యాయి? అంటూ శంకర్ నాయక్ బహిరంగంగా కవితను ఉద్దేశించి ఆరోపణలు చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.

- డోర్నకల్‌లో మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్​మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. గత నెల వరకు ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్​ఇప్పుడు మాజీగా మారారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలు పెట్టారని పార్టీ నాయకులు చెబుతున్నారు. గతంలోనూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పార్టీ పెద్దల సూచనల మేరకు కొంత మేరకు తగ్గించినా తాజాగా తన రాజకీయ ఉనికి, ప్రాతినిధ్యం కోసం పర్యటించడం షురూ చేశారు. దీంతో ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అధిపత్య పోరు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

- భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత మధుసూదనచారీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన ఓటమికి మధుసూదనాచారీ వ్యతిరేక కార్యకలాపాలే కారణమని గండ్ర పలు మార్లు పార్టీ పెద్దలు, జిల్లా ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపైనా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచరుల ద్వారా తెలిసింది. మధుసూదనాచారీ మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత కావడంతో ఆయన ప్రొటోకాల్​విషయంలో కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు.

- హన్మకొండలో వినయ్​భాస్కర్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. ఇది ఇప్పటి వరకు బయటికి కనపడకపోయినా వినయ్​భాస్కర్‌లో కొంత అసహనానికి కారణమవుతుందని అంటున్నారు.

- షాద్‌నగర్‌లో ఎమ్మెల్సీ నవీన్​కుమార్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​మధ్య పొసగడం లేదు. ఈ సారి టికెట్ తనకే అంటూ నవీన్‌కుమార్‌రెడ్డి తిరుగుతున్నారని, పార్టీ పెద్దలు ఆయనకే ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహారాలు ఉన్నాయని.. అంజయ్య యాదవ్​వాపోయినట్టు తెలిసింది. ఈ సారి తన కొడుక్కి టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్న అంజయ్య యాదవ్..​నవీన్ రెడ్డి వ్యవహారం విషయంలో సతమతం అవుతున్నట్టు తెలిసింది.

- కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్​యాదవ్, వెంకటేశ్​గుప్తాల మధ్య ఇదే రకమైన పోరు నడుస్తోంది. వెంకటేశ్​గుప్తా పార్టీ ప్రోగ్రామ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఆయన పార్టీలోకి వచ్చిన కొత్తలోనే మిషన్​భగీరథ లాంటి కీలక పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సారి టిక్కెట్ తనదేననే భావనలో ఆయన తన అనుచరులతో చెప్పుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

- నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్​నియోజకవర్గంలో కోటిరెడ్డి, నోముల భగత్, ఆలేరు నియోజకవర్గంలో మాజీ విప్​గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్​మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

- మేడ్చల్​జిల్లా కంటోన్మెంట్‌లో బహునాయకత్వం పార్టీకి తలనొప్పిగా మారింది. చివరికి వారి మధ్య సయోధ్య సాధ్యం కాదని అంచనాకు వచ్చిన పార్టీ నాయకత్వం మాల్కాజిగిరి​ఎమ్మెల్యేను అక్కడ ఇన్‌చార్జిగా నియమించింది.

- కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్​రాజుల మధ్య ఆధిపత్య అంతర్గతంగా ఉన్నది. బయటికి కనపడకుండా ఇద్దరు మేనేజ్​చేసుకుంటున్నారని అక్కడి నాయకులు చెబుతున్నారు.

Next Story