‘ధరణి’పై సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ నివేదిక బయటికొస్తే రాజకీయ ప్రకంపనలు ఖాయం!

by Gantepaka Srikanth |

ధరణ్ పోర్టల్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు సిద్ధమైంది. నాలుగు కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరపగా, తాము పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని, ఇప్పటికిప్పుడు చేయడం సాధ్యం కాదని మూడు కంపెనీలు చెప్పినట్లు తెలిసింది.

‘ధరణి’పై సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ నివేదిక బయటికొస్తే రాజకీయ ప్రకంపనలు ఖాయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణ్ పోర్టల్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు సిద్ధమైంది. నాలుగు కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరపగా, తాము పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని, ఇప్పటికిప్పుడు చేయడం సాధ్యం కాదని మూడు కంపెనీలు చెప్పినట్లు తెలిసింది. ఒక సంస్థ మాత్రం ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేసి పూర్తి నివేదిక అందించేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో దీనికి ఎస్టిమేట్స్ ఇవ్వాలని ప్రభుత్వం సదరు కంపెనీని కోరింది. అయితే ఈ నెలాఖరులోగా ఆడిట్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. జూన్ నెలాఖరుకల్లా ధరణిలో ఎంత మంది దొంగలు పడ్డారో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ ఆడిట్ ద్వారా ఇల్లీగల్ లాగిన్ డిటెయిల్స్ మాత్రమే వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంటే రెవెన్యూ కార్యాలయాల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు కంపెనీలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు? ఏమేం మార్పులు చేశారు? ఎవరి పాస్‌వర్డ్ వినియోగించారు? ఇలాంటి అంశాలు ఆడిట్ ద్వారా స్పష్టం కానున్నాయి.

విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి..

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రధానంగా కలెక్టర్లకు మాత్రమే లాగిన్ ఐడీలు ఇచ్చింది. సీసీఎల్ఏలో ఐఏఎస్ అధికారులు, టీఎస్ ఆఫీసర్లకు మాత్రమే ధరణి పోర్టల్‌లో డేటా చేంజ్ చేసేందుకు లాగిన్ ఐడీలు జారీ చేశారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా భూముల దొంగలకు సహకరించిన అధికారుల వివరాలు బయటికి రానున్నాయి. ఆ తర్వాత విచారణ జరిపితే వారి వెనుకున్న లీడర్లు, పెద్ద తలకాయలు ఎవరో బహిర్గతం కానున్నది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు పొందిన ప్రైవేటు విదేశీ కంపెనీకి ఏయే లీడర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయన్న విషయాలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పలుమార్లు మీడియాకు వివరించారు. ఇప్పుడీ ఫోరెన్సిక్ ఆడిట్ సకాలంలో, సరైన పద్ధతిలో పూర్తయితే రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటాయన్న చర్చ జరుగుతున్నది.

అనేక అంశాల పరిశీలన

ధరణి పోర్టల్ అమల్లో ఉన్నన్ని రోజులు ఎన్నెన్నో భూదందాలు నడిచాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రికార్డులు మార్చి పాసు పుస్తకాలు ఇచ్చారు. కింది స్థాయి అధికారులు రిజెక్ట్ చేసినా.. కలెక్టర్లు ఆమోదించిన ఫైళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనేక అంశాలను పరిశీలించనున్నారు. డేటాను సాంకేతిక పరంగా విశ్లేషించనున్నారు. ప్రతి చేంజెస్ ఏ లాగిన్ నుంచి చోటు చేసుకున్నాయనేది ఆరా తీయనున్నారు. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, ఆడిట్ డేటా, డాక్యుమెంటేషన్ డేటా, హిస్టరీ డేటా.. ఇలాంటి అంశాలను ప్రధానంగా ఫోరెన్సిక్ ఆడిట్ విశ్లేషించనున్నదని ఓ ఐఏఎస్ ఆఫీసర్ వివరించారు. అయితే ఎక్కడెక్కడి నుంచి లాగిన్ అయ్యారనే అంశం చాలా కీలకమైనది. ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలు, ఇతర దేశాల నుంచి ఏమైనా లాగిన్ అయి, మార్పులు చేశారన్న అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన డేటాను ఎవరైనా డౌన్‌లోడ్ చేశారా? ఫార్వర్డ్ చేశారా? ఎవరు చేశారు? ఇదంతా ఎక్కడి నుంచి చోటు చేసుకున్నది? ఎవరి లాగిన్ నుంచి జరిగింది? ఈ అంశాల్లో స్పష్టత వస్తే ధరణిలో భూముల దొంగలెవరో లెక్క తేల్చడం పెద్ద కష్టం కాదని ప్రభుత్వం భావిస్తున్నది. అలాగే ప్రైవేటు విదేశీ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా తలెత్తిన ఇష్యూస్, లాభం, నష్టం వంటి విషయాలపైనా ఆరా తీయనున్నారు.

నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చి..

ఏదైనా బలమైన రీజన్ ఉంటే తప్ప భూమి స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దు. కానీ దశాబ్దాలుగా పట్టాగా ఉన్న వాటిని ప్రభుత్వానివిగా నమోదు చేసి కొందరు అధికారులు రూ.కోట్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా ఎలాంటి నోటిఫికేషన్ లేకపోయినా.. భూసేకరణ పేరిట అనేక ల్యాండ్స్ బ్లాక్ చేశారు. అయితే ధరణిలో నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్పునకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది. కానీ అధికారులు ఇష్టారాజ్యంగా చేంజెస్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. వేలాది ఫైళ్లు పెండింగులోనే ఉండటాన్ని భూభారతి డ్యాష్ బోర్డు సైతం చూపిస్తున్నది. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా పలుమార్లు మారిన నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూస్ గుర్తించే వీలున్నది. కానీ సర్వాధికారాలు అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లు మాత్రమే చెలాయించారు. ఈ క్రమంలో కలెక్టర్ల అవినీతి, అక్రమాల ఉనికిని గుర్తించే వీలుంటుందా? ఉండదా? అన్న సందేహం వ్యక్తమవుతున్నది.

అర్ధరాత్రి ట్రాన్సాక్షన్స్

రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో అనేక భూదందాలు సాగాయి. ఇందులో ఈడీ, ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆఫీసు సమయాల్లో కాకుండా రాత్రి 12 గంటల వరకు ట్రాన్సాక్షన్స్ చేసిన ఉదంతాలపై ఫోకస్ పెట్టనున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి, ఎవరి ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్ల ద్వారా జరిగాయన్న అంశాలను నిగ్గు తేల్చనున్నారు. అసలు సంతకాలు ఒరిజినలేనా? ఫోర్జరీయా? ఇలాంటి అనేక అంశాలను వెలికితీయనున్నారు. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, పుప్పాలగూడ, నార్సింగి.. ప్రాంతాల్లో వక్ఫ్, ఇనాం, కాందీశీకుల భూమి, సర్కారు భూములను కొల్లగొట్టారన్న ఆధారాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తొలి నుంచి ఉన్న క్లాసిఫికేషన్ ఏంటి? ఇప్పుడు సడెన్‌గా ఏ ఆధారాలూ లేకుండా పట్టా భూములుగా మార్చిన ఉదంతాలకు ఏయే ఆఫీసర్లు కారణమన్న విషయాన్ని తేల్చనున్నారు. ఈ క్లాసిఫికేషన్‌కు ఎలాంటి ఆధారాలు లేకుండానే మార్చిన భూముల విస్తీర్ణం ఎంతో లెక్కలు తీయనున్నారు.

అధికార దుర్వినియోగం

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ ప్రతిపాదన లేకుండానే ఎల్ఏజీ నంబర్లతో పలు భూములను పీవోబీలో నమోదు చేశారు. ఆ తర్వాత కొందరు అధికార, అంగ, ఆర్థిక బలంతో ముఠాలను రంగంలోకి దింపి.. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపారు. నయానో, భయానో వాటిని అప్పగించకపోతే దక్కని పరిస్థితులను కల్పించారన్న ఆరోపణలున్నాయి. ఇలా.. హైదరాబాద్ నగరం చుట్టూ ఎల్ఏజీ నంబర్ వేసి పట్టా భూములపై నిషేధం ఎందుకు విధించారన్న అంశంపై దర్యాప్తు జరగాలి. దానికి కారణమైన అధికారులు ఎవరు? ఆ తర్వాత సదరు భూములను ఎవరు కొనుగోలు చేశారు? ఈ విషయాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లెక్కలు తీస్తే ధరణిని అడ్డం పెట్టుకొని ఎవరు భూములను కొల్లగొట్టారన్న పూర్తి వివరాలు బయటికొస్తాయని కొందరు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.

చర్యలు తీసుకుంటేనే..

కొన్ని పట్టా భూములను ప్రభుత్వానివిగా రాసి, నిషేధిత జాబితాలో నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు ప్రభుత్వ భూములను ఏకపక్షంగా ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు కట్టబెట్టారని కొందరు కలెక్టర్లపై ఆరోపణలు వస్తున్నాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు తిరస్కరించినా కలెక్టర్లు స్వయంగా నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్‌ను మార్చి పట్టాలు ఇప్పించారు. ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో ఇలాంటివి చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో కలెక్టర్లకు అధికారాలు అప్పగించడం ద్వారానే ఏకపక్షంగా చేయగలిగారు. ఇప్పుడు అలాంటి అక్రమాలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్‌తో పని లేదు. చట్టానికి వ్యతిరేకంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకునే నిర్ణయం ప్రభుత్వంపైనే ఆధారాపడి ఉన్నది. ప్రధానంగా పీవోబీ జాబితాలో నమోదు చేయడం, తొలగించడం, మళ్లీ నమోదు చేయడం వంటి కార్యక్రమాలకు పాల్పడినా, ప్రభుత్వ భూములను ప్రైవేటుగా మార్చిన వాటిపై సీరియస్‌గా దృష్టి పెడితే తప్ప భవిష్యత్తులో మరోసారి పునరావృతం కావన్న అభిప్రాయం ధరణి బాధితుల్లో ఉంది.

Next Story