ఇలా అయితే డిగ్రీలు పూర్తయ్యేది ఎలా?

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇలా అయితే డిగ్రీలు పూర్తయ్యేది ఎలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉన్నత విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ప్రభుత్వ కళాశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా అటానమస్ హోదా పొందిన కళాశాలల్లో సైతం కనీస వసతులు లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. గత రెండేళ్లుగా కాలేజీ విద్య కమిషనరేట్ అధికారులు కళాశాలల ప్రిన్సిపాళ్లతో కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు, పర్యవేక్షణ లేకపోవడంతో కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుందని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 124 డిగ్రీ కాలేజీలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అటానమస్ హోదా కలిగిన 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు పలువురు విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.

ల్యాబ్‌లు ఉన్నా... బోధకులు లేరు..

కళాశాలల్లో విద్యార్థుల కోసం ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిలో ప్రయోగాలు చేయించే వారు కరువయ్యారు. ప్రయోగశాలలు ఉన్నా క్లాసులు చెప్పే అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు కేవలం థియరీ చదువులకే పరిమితమవుతున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక విద్యార్థులు నష్టపోతున్నారు. చాలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అత్యథికంగా కంప్యూటర్స్ చదివే విద్యార్థులు ఉన్నారు. కంప్యూటర్ బోధించే అధ్యాపకులు లేకపోవడం కారణంగా విలువైన కంప్యూటర్ ల్యాబ్‌లు నిరుపయోగంగా మారుతున్నాయి. డిగ్రీలోని ప్రతీ సబ్జెక్టులో కంప్యూటర్ సాధారణంగా ఉంది. బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్ ఇలా ప్రతి కోర్సులో కంప్యూటర్ ఉంటుంది. ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొత్తం 3 వేల మంది విద్యార్థులుంటే అందులో 2500 మంది కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు కావడం గమనార్హం. పాత బస్తీ సిటీ కాలేజీలో 4500 మంది చదువుతున్నారు. కానీ కంప్యూటర్ బోధించే అధ్యాపకులు లేక గెస్ట్ లెక్చరర్లలతో నామమాత్రపు బోధన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులను నిర్వహిస్తున్నారని, గెస్ట్ ఫ్యాకల్టీపై పూర్తి భారం మోపడం వల్ల బోధన ప్రమాణాలపై ప్రభావం పడుతోందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.

రూసా నిధుల దుర్వినియోగం..

కళాశాలల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించే రూసా నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాల్సిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. రూసా నిధులు ఉన్నప్పటికీ, సరైన వినియోగం లేకపోవడం, నిధుల కొరతతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి, ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. ఉన్నత విద్యా సంస్థలకు రూసా నిధులు ఉన్నప్పటికీ, వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని, తగిన నిధులు లేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెనుకబడుతున్నాయని, దీనివల్ల విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల వైపు మళ్లుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

Next Story