- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం ఆశ్చర్యకరం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఎన్డీఏ అభ్యర్థిగా ఉప రాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ దన్‌ఖడ్ పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్డీఏ అభ్యర్థిగా ఉప రాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ దన్‌ఖడ్ పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని అభినందించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలుగు వారంతా సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
నీలం సంజీవరెడ్డి, వివి గిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, నేడు తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరని కామెంట్ చేశారు. ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. ఆయన పోటీతో చేయడం వల్ల ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వబోతోందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి, రాజ్యాంగాన్ని కాపాడాలని, రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగాయని అన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని.. అన్ని పరిణామాలను దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు. ఒక తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో అత్యున్నత పదవిని చేపట్టేందుకు అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, కేసీఆర్, ఓవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు
ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయని కామెంట్ చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉందని, ఆయన వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో పని చేశారని గుర్తు చేశారు. ఎజెండా, జెండా లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అందురూ మద్దతు ఇవ్వాలని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారని తెలిపారు. నక్సలిజం ఒక విధానం మాత్రమేనని.. నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు.. మనకు నచ్చని ఫిలాసఫీతో వాదించి గెలవాలన్నారు. కానీ, అంతం చేస్తానంటే కుదరదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.






