- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్, బీజేపీల బంధం కొనసాగుతోంది.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ -బీజేపీ బంధం కొనసాగుతోందని, ఈ 16 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (BRS Leader Ravula Sridhar Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ -బీజేపీ బంధం కొనసాగుతోందని, ఈ 16 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (BRS Leader Ravula Sridhar Reddy) అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం, మంత్రుల మాటలను చూస్తుంటే రాష్ట్రంలో సుతి, మతి, గతి లేని ప్రభుత్వం ఉందని అర్థమవుతుందని, సీఎం, మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. ఓ వైపు సీఎం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అంటున్నారని, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినప్పుడు తమకు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు అని, నెలకు 500 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి వ్యయం చేసే స్థితి లేమని సీఎం అంటున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు బాగున్నాయని ఒలింపిక్స్ నిర్వహిస్తామని అంటున్నారని, సీఎం మాటలతో రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు, ఒలింపిక్స్ నిర్వహణకు అసలు సంబంధం ఉందా? అని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు జోకర్ (Joker) మాటలు అని హాట్ కామెంట్స్ చేశారు. గత ఒలింపిక్స్(Olympics) నిర్వహణకు లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒలింపిక్స్ నిర్వహణ నుంచి పారిపోతున్నాయని, కానీ "మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగె నూనె" అన్నట్టు ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. ఇక ఒలింపిక్స్ నిర్వహణకు ముందు దేశం సిద్ధం కావాలి.. రాష్ట్రం కాదు అని, సీఎం సంచలనాల కోసం గప్పాలు కొడుతున్నారని అన్నారు.
మిస్ వరల్డ్ పోటీలు (Miss World Compitition) నిర్వహిస్తున్నామని అంటున్న రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసును ఎందుకు తప్పు పట్టారు? అని ప్రశ్నించారు. మార్చి 1 నుంచి రేషన్ కార్డుల పంపిణీ అన్నారు.. ఏమైంది? అని, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని రేవంత్ ఓ వైపు అంటూ కేసీఆర్‌ను తిడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. 14 నెలల్లోనే తెలంగాణ దేశానికి మోడల్ అయిందా? అంటూ.. కేసీఆర్ (KCR) కృషితోనే తెలంగాణ రోల్ మోడల్ అయిందని చెప్పారు. ఇక జాతీయ వేదికల మీద రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయొద్దని, ముందు చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చిన తర్వాత సీఎం వేరే పెద్ద విషయాలు మాట్లాడాలని హితవు పలికారు.
అఖిల పక్ష ఎంపీ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం (MIM) మాత్రమే హాజరయ్యాయని, ఇది అఖిల పక్ష మీటింగ్ కాదు, దిశా దిశ లేని మీటింగ్ అని విమర్శించారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు కలిస్తే గుండు సున్నా అని, వీరి వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో పోరాడే సత్తా ఉందని చెబుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ బంధం (Congress -BJP Bond) కొనసాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ-రేవంత్‌లు "బడే భాయ్ - చోటే భాయ్" లాగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్‌ను అఖిల పక్ష సమావేశానికి పిలిస్తే ఎలా? అని బీఆర్ఎస్ నేత దుయ్యబట్టారు.






